సాక్షి, చెన్నై : ఐఐటీ – మద్రాసులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధిని ఫాతిమా లతీఫ్ మరణం కేసు మలుపు తిరిగింది. ముగ్గురు ప్రొఫెసర్ల వేధింపులతో ఆ యువతి బలన్మరణానికి పాల్పడినట్టుగా వెలుగు చూసింది. దీంతో ఫాతిమా మరణానికి న్యాయం కోరుతూ విద్యార్థులు చెన్నైలో ఆందోళన బాట పట్టారు. అడయార్‌లో ఐఐటీ –మద్రాసు క్యాంపస్ ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ విద్యా సంస్థలు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యషిస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవల కాలంగా ఇక్కడ విద్యార్థులు బలన్మరణాలకు పాల్పడడంపెరుగుతోంది. అయితే, పరీక్షల్లో తప్పడం, ఎంపిక చేసుకున్న కోర్సుల మీద ఆసక్తిలేక పోవడం, మానసిక ఒత్తిడి అంటూ విద్యార్థులు బలన్మరణాలకు పాల్పడుతున్నట్టుగా అక్కడి నిర్వాహకులు పేర్కొంటున్నా, ఒత్తిళ్ల ఆరోపణలు గుప్పించే వాళ్లు ఎక్కువే. ఈనేపథ్యంలో కేరళ రాష్ట్రం కొల్లం కిలికొళ్లురు గ్రామానికి చెందిన ఫాతిమా లతీఫ్(19) తొలి సంవత్సరం ఎంఏ చదువుతున్నది. ప్రతి రోజూ ఇంటికి తప్పని సరిగా ఫోన్ చేసినానంతరం నిద్ర పోవడం ఫాతిమాకు అలవాటు. శనివారం రాత్రి ఆమె తల్లి సజిత లతీఫ్ కుమార్తెకు ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో ఆమె స్నేహితురాలికి ఫోన్ చేశారు. ఆమె గదికి స్నేహితురాలు వెళ్లి చూడగా, తలుపులు తెరచుకోలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది తలుపు పగల కొట్టి లోనికి వెళ్లగా,అ క్కడ ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఫాతిమా వేళాడుతుండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న కోట్టూరు పురం పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కేసును ఆత్మహత్యగా నమోదు చేసినా అసలు ట్విస్టు అన్నది తాజాగా బయట పడింది.
తండ్రికి సమాచారం...
ఫాతిమా తండ్రి అబ్దుల్ లతీఫ్ విదేశాల్లో ఉన్నారు. ఆయనకు ఫాతిమా ఓ సమాచారాన్ని పంపించి ఉన్నది. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు తీవ్రంగా వేదిస్తున్నారని, వారి వేధింపులు తాళ లేక బలన్మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి ఉన్నట్టు వివరించి ఉండటం వెలుగు చూసింది. ఈ విషయాన్ని కోట్టూరు పురం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో కొల్లం మేయర్‌గా ఉన్న అబ్దుల్ లతీఫ్ స్నేహితుడు రాజేంద్ర బాబుతో కలిసి ఫాతిమా సోదరి అయ్యేషా కేరళ సిఎం పినరాయ్‌విజయన్ కలిశారు. దీంతో వ్యవహారం ముదిరింది. అక్కడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి కార్యాలయానికి, డీజీపికి సమాచారం రావడంతో కోట్టూరు పురం పోలీసులకు ముచ్చమటలు తప్పలేదు. బుధవారం తమ విచారణను వేగవంతం చేశారు. దీంతో ఫాతిమా మరణం వెనుక ప్రొఫెసర్ల వేదింపులు ఉన్నట్టుగా తేలి ఉన్నది. ఇప్పటి వరకు 11 మంది ప్రొఫెసర్ల వద్ద కోట్టూరు పురం పోలీసులు విచారించినట్టు సమాచారం. అయితే, ఆ ముగ్గురు ప్రొఫెసర్లను సస్పెండ్ చేయాలని , వారి మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ, క్యాంప్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఐఐటీని ముట్టడించేందుఉ ఆ ఫ్రంట్ వర్గాలు బుధవారం సాయంత్రం ప్రయత్నించారు. ప్రొఫెసర్ల వేదింపులతో గత కొన్ని నెలల్లో ఐదు మంది విద్యార్థులు బలన్మరణానికి పాల్పడి ఉన్నారని, ఈ కేసుల మీద కూడా విచారణ జరగాలని, విద్యార్థుల మరణాలకు న్యాయంజరగాలని పట్టుబడుతూ వారు ఆందోళనను ఉధృతంచేశారు. దీంతో వారిని బుజ్జగించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. దీంతో ఐఐటీ పరిసర మార్గాల్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment