
మౌనికాదేవితో దిశ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీకి ఫిర్యాదు అందిస్తున్న షర్మిలారెడ్డి
రాజమహేంద్రవరం క్రైం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాజమహేంద్రవరంలో ప్రారంభించిన దిశ మహిళా పోలీస్ స్టేషన్‌లో తొలిసారిగా ఆదివారం రెండు కేసులు నమోదయ్యాయి. భర్తల వేధింపులకు గురవుతున్న ఇద్దరు మహిళలు ఈ మేరకు ఫిర్యాదులు చేశారు. వారికి వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి తోడ్పాటు అందించారు. భర్త, అత్తమామలు వరకట్నం తీసుకురావాలంటూ తనను వేధిస్తున్నారంటూ నగరంలోని ఇన్నీసుపేటకు చెందిన కొండపల్లి మౌనికాదేవి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇరువర్గాలకూ రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినప్పటికి వారిలో మార్పు రాకపోవడంతో దిశ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆదివారం మొట్టమొదటి కేసు నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తు అధికారిగా మహిళా ఎస్సై రేవతిని నియమించారు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తారని తెలిపారు. అలాగే తన భర్త శ్రీరామ్ రవితేజను అత్తమామలు మూడు నెలలుగా దాచేసి, కాపురానికి రాకుండా వేధింపులకు గురి చేస్తున్నారని స్థానిక నెహ్రూనగర్ సుబ్బారావుపేటకు చెందిన వివాహిత జ్యోతిర్మయి ఫిర్యాదు చేసింది. తమకు దివ్యాంగురాలైన బిడ్డ పుట్టిందని, ఆ కుమార్తె తనవల్లనే మృతి చెందినట్లు వేధిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసి బాధిత మహిళలకు న్యాయం చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ దగా పడిన మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొండంత అండగా దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment