పిల్లలతో లత, దొరస్వామి దంపతులు (ఫైల్)
ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. వారి సంతోషాన్ని చిదిమేసింది. ఏడాది క్రితం కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలకూ తల్లే దిక్కయింది. ఇంతలో మరో విషాదం ఆ కుటుంబాన్ని కుదిపేసింది. శుక్రవారం ఉదయం ఇద్దరు పిల్లల ప్రాణాలను మాయదారి గుంత పొట్టన బెట్టుకుంది. దీంతో కన్నతల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమెకొచ్చిన కొండంత కష్టం చూసి గ్రామం గుండె బరువెక్కింది.
యాదమరి: మరో నాలుగు రోజులు గడిస్తే వేసవి సెలవులు ముగిసేవి. ఆ పిల్లలు ఎంచక్కా పాఠశాలకు వెళ్లేవారు. సెలవులయిపోతున్నాయని ఐదుగురు పిల్లలు కల్వర్టు గుంత వద్దకు వెళ్లారు. లోతును అంచనా వేయలేని వయస్సు..చూస్తుండగానే ఇద్దరు పిల్లలు మునిగిపోయారు. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.. యాదమరి మండలం బొమ్మన్ చేనులో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దొరస్వామి, లతలకు ముగ్గురు సంతానం. వీరిలో ఇందు(13)యాదమరి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి, హరీష్ అతికారపల్లెలో ఐదో తరగతి, మోనిషా(7) మూడో తరగతి చదువుతున్నారు. బంధువు ఒకరు మృతి చెందడంతో శుక్రవారం ఉదయం లత బిడ్డలను ఇంట్లో ఉంచి తమిళనాడు వెళ్లింది.
తల్లి లేదు కదా అని ముగ్గురు పిల్లలు, తమ మేనత్త పిల్లలిద్దరితో కలసి పంటపొలం సమీపాన కల్వర్టు గుంత వద్దకు వెళ్లారు. నీవానదిలో ఇటీవల వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో గుంతలో నీరు ఎక్కువగా చేరింది. హరీష్, మరో పిల్లలు గట్టుపై నిల్చోని నీటిలో చేపలున్నాయోమోనని చూస్తున్నారు. ఇంతలో ఇందు..మోనిషా నీటి కుంటలో దిగారు. లోతుగా ఉండడంతో ఈత రాక మునిగిపోయారు. గట్టుపై ఉన్న పిల్లలు పైకి వస్తారని చూస్తున్నారు. వారెం తకూ రాకపోవడంతో వెంటనే కేకలు వేశారు. దగ్గర్లోని తెలిసిన వాళ్లకు, పశువుల కాపర్లకు విషయం చెప్పారు. వారు నీటిలోకి దిగి కొన ఊపిరితో ఉన్న చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఇందు మృతి చెందగా కాసేపటికీ ఆమె చెల్లెలు మోనిషా కూడా ప్రాణం విడిచింది. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది.
ఏడాదిలోనే రెండు దారుణాలు..
గతేడాది ఈ ఇంట ఓ విషాదం చోటుచేసుకుంది. దొరస్వామి తన తల్లి ఆరోగ్యం కోసం అప్పులు చేశారు. వ్యవసాయం కలిసిరాలేదు. చేసిన అప్పు తీరలేదు. తల్లి మరణించింది. మనోవేదన చెందిన దొరస్వామి గతేడాది మేలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది తిరిగిన కొద్ది రోజులకే ఇద్దరు బిడ్డలు చనిపోవడం గ్రామస్తుల గుండెలను పిండేసింది. దొరస్వామి భార్యను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ‘మూడు రోజుల్లో స్కూళ్లు తెరుస్తారని పుస్తకాలు కూడా తెచ్చాను. వాటిని చూసి ఎంతో సరదా పడ్డారు.. ఇంతలోనే శవాలయ్యారు’ అంటూ తల్లి కన్నీరుమున్నీరయింది. తహసీల్దార్ రెడ్డప్ప, ఎంఈ ఓ జయప్రకాష్, ఎంపీడీఓ గిరధర్ రెడ్డి సాయంత్రం గ్రామానికి వెళ్లి మృతుల తల్లిని ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment