మృతిచెందిన రోహిత్, శివ
గుడిపాల (చిత్తూరు): నాన్న వద్దన్నా అమ్మమ్మ ఇంటికి వెళ్లాలని మారాం చేశారు. పిల్లల కోరిక కాదనలేక తండ్రి సరేనన్నాడు. అక్కడికెళ్లి అమ్మమ్మను చికెన్ కావాలని అడిగారు. మనవళ్ల కోరిక కాదనలేక అమ్మమ్మ చికెన్ తీసుకొచ్చి వండే క్రమంలో పొరపాటుగా మసాలా పొడికి బదులు అక్కడే ఉన్న గుళికల మందు వేసింది. ఆ చికెన్ తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఏఎల్‌పురం గ్రామానికి చెందిన గోవిందమ్మ, సహదేవన్‌ల కుమార్తె ధనమ్మకు తవణంపల్లె మండలం ఉత్తబ్రాహ్మణపల్లెకు చెందిన రాంబాబుతో 13 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ధనమ్మ అనారోగ్యం కారణంగా రెండేళ్ల క్రితం మృతి చెందింది.
వీరికి రోహిత్ (12), జీవ (10) అనే కుమారులు ఉన్నారు. పాఠశాలలు లేకపోవడంతో పిల్లలు అమ్మమ్మ ఇంటికెళతామని మారాం చేశారు. దీంతో రాంబాబు తన తమ్ముడు సురేష్‌తో కలిపి పిల్లలిద్దర్నీ అమ్మమ్మ ఇంటికి పంపాడు. సోమవారం గోవిందమ్మను మనవళ్లు చికెన్ కావాలని కోరారు. చికెన్ చేసే క్రమంలో మసాలా పొడి అనుకుని అక్కడే కవర్లో ఉన్న గుళికల మందు చికెన్‌లో వేసింది. ఆ కూర ఇద్దరు మనవళ్లకు పెట్టి, తానూ తినడం ప్రారంభించింది. ఇంతలో మనవళ్లకు వాంతులు కావడంతో స్థానికులు గుర్తించి, చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెందారు. గోవిందమ్మ పరిస్థితి కూడా విషమంగా ఉంది. గుడిపాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవిందమ్మ
Comments
Please login to add a commentAdd a comment