
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని భట్‌పారా ప్రాంతంలో చెలరేగిన హింస కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం గుర్తుతెలియని వ్యక్తుల మధ్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతరు ఉన్నతాధికారులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచనల మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లర్లలో రాంబాబు షా(17) అనే పానీ పూరీ బండి నడుపుకునే యువకుడు, మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనాస్థలంలో చిన్న సైజు బాంబు విసిరినట్లుగా, కాల్పులు జరిగినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి.
అల్లరి మూకల్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గాస్ ఉపయోగించారు. పోలీసులు గాలిలోకి కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం అందింది. ఇదంతా కూడా బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో డీజీపీ, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సంబంధించి ఒక కొత్త బిల్డింగ్‌ను ప్రారంభించే ఒక గంట ముందు చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి డీజీపీ కొత్త బిల్డింగ్‌ను ఓపెనింగ్ చేయకుండా తిరిగి కోల్‌కత్తాకు బయలుదేరి వెళ్లారు. అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో పాటు లోకల్ పోలీసులను ప్రభుత్వం మోహరించింది. అల్లర్ల నేపథ్యంలో దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment