
వెంకట్రావు మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ
ప్రకాశం, గొబ్బూరు (పెద్దారవీడు): బైకును ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని గొబ్బూరు ఆల్లూరి పోలేరమ్మ దేవాలయం సమీపంలో గురువారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు నుంచి గొర్రెలను ట్రాలీ ఆటోలో ఎక్కించుకొని మండలంలోని హనుమాన్‌జంక్షన్ కుంటలో ఉన్న గొర్రెల మండి (సంత)కి బయల్దేరింది. గొర్రెలను దించేసిన అనంతరం ట్రాలీ ఆటో తిరిగి బయల్దేరింది. మార్కాపురం మండలం రాయవరం నుంచి వినుకొండ మండలం భారతిపురం గ్రామానికి చెందిన బత్తుల వెంకట్రావు, మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామానికి చెందిన తురగ రాజు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా మార్గంమధ్యలో గొబ్బూరు ఆల్లూరి పోలేరమ్మ దేవాలయం సమీపంలో బైకును ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో తురగ రాజు (20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడిన బత్తుల వెంకట్రావు (40)ను అంబులెన్స్‌లో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. బత్తుల వెంకట్రావు రాయవరంలో వివాహం చేసుకున్నాడు. అత్తగారి ఇంటికి వచ్చి గురువారం ఉదయం సొంత గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు తురగ రాజుకు భార్య లక్ష్మి, కుమారుడు ఉన్నారు. వెంకట్రావు భార్య గురవమ్మ కన్నీమున్నీరైంది. మృతులు భారతిపురం చేరుకొని తెలంగాణ రాష్ట్రంలో బేల్దారి పనులకు వెళ్లేందుకు బయల్దేరినట్లు తెలిసింది. ట్రాలీ ఆటో డ్రైవర్‌కు డైవింగ్ లైసన్స్ లేదు. అతడు సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment