పట్టుబడిన నిందుతులు, జయశ్రీ (ఫైల్)
సాక్షి, చెన్నై: పాత కక్షలకు అభంశుభం తెలియని బాలిక సజీవ దహనమైంది. ఆమె తండ్రిపై ఉన్న వ్యక్తిగత కక్షలతో అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు నాయకులు కిరాతకానికి ఒడిగట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక కాళ్లు చేతులు కట్టి పడేశారు. నోట్లో గుడ్డ కుక్కి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం బాలిక మృతి చెందింది. ఈ ఘటన విల్లుపురంలో చోటుచేసుకుంది.
తిరువెన్నై నల్లూరు సమీపంలోని సిరుమదురై గ్రామానికి చెందిన జయపాల్ రాజీ దంపతులకు కుమారులు జయరాజ్ (16), జబరాజ్ (10), కుమార్తెలు జయశ్రీ (15), రాజేశ్వరి (12) ఉన్నారు. వీరికి సిరుమదురైలో రెండు కిరాన షాపులు ఉన్నాయి. జయశ్రీ((15) స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆదివారం జయపాల్ ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని స్థానికలు గుర్తించారు. మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయలైన జయశ్రీని విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రికి తరలించారు.
పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు..
అదే రోజు సాయంత్రం బాలిక స్పృహలోకి రావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేజిస్ట్రేట్ అరుణ్‌కుమార్ రంగంలోకి దిగారు. బాలిక వద్ద వీడియో వాంగ్ములం తీసుకున్నారు. ఇంట్లో తాను ఒంటరిగా ఉండగా మురుగన్, కళియ పెరుమాల్ తన కాళ్లు చేతులు కట్టేశారని..కేకలు పెట్టేలోపు నోటిలో గుడ్డను కుక్కేశారని వాపోయింది. అనంతరం నిప్పు పెట్టారని తెలిపింది. గాయాలు తాళలేక అరుపులతో ఆ బాలిక ఇచ్చిన వాంగ్ములం అక్కడి వారినే కలిచి వేసింది. వాంగ్ములంతో అధికారులు సిరుమదురైకు వెళ్లారు.
పాతకక్షలతో..
అజ్ఞాతంలోకి వెళ్లేందుకు యత్నించిన మురుగన్, కళియ పెరుమాల్‌ను పోలీసులు పట్టుకున్నారు. తండ్రి జయపాల్‌పై ఉన్న కోపంతో బాలికను టార్గెట్ చేసినట్టు తేలింది. జయపాల్, మురుగన్ మధ్య పదేళ్లుగా వ్యక్తిగత కక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం షాపు వద్ద జయశ్రీ సోదరుడు జయరాజ్‌పై మురుగన్ అనుచరులు దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందినానంతరం శనివారం అతడు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ కేసు విషయంగా ఆదివారం జయపాల్ కుటుంబం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. ఇది తెలుసుకున్న మురుగన్, కళియ పెరుమాల్ ఆగ్రహంతో కిరాతకానికి ఒడిగట్టారు.
మృత్యువుతో పోరాడి..
తీవ్రగాయాలతో ఆస్పత్రిలో జయశ్రీ నరకాన్ని చవి చూసింది. 95 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను రక్షించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమె వద్ద నుంచి న్యాయమూర్తి అరుణ్‌కుమార్ రెండుసార్లు వాంగ్ములం తీసుకున్నారు. సోమవారం మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది.
కఠినంగా శిక్షించాలి..
మురుగన్ మాజీ కౌన్సిలర్ కాగా కళియ పెరుమాల్ అన్నాడీఎంకే స్థానిక పార్టీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం కాస్త రాజకీయ దుమారానికి దారి తీసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పీఎంకే నేత రాందాసు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షుడు కేఎస్ అళగిరి, వీసీకే, వామపక్షాల నేతలు ఈ కిరాతకుల చర్యలను ఖండించారు. ఇద్దరికి కఠిన శిక్ష విధించే విధంగా నాన్ బెయిల్ కేసులు నమోదు చేయాలని, విచారణను త్వరితగతిన పూర్తి చేసి శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై జాతీయ బాలల కమిషన్ స్పందించింది. కేసును సుమోటాగా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఇద్దరిని అన్నా డీఎంకే నుంచి సస్పెండ్‌చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment