రుద్రాక్షుల సత్యనారాయణ, తలచుట్ల లక్ష్మన్నాయుడు
సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : కొద్ది రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండడంతో తెల్లవారు జామునే పనులు చేసుకుందామనుకున్నారు. ఇందులో భాగంగానే తెల్లవారే పనులకు వెళ్లారు. అయితే విధి వక్రీకరించడంతో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇంటి యజమానులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు లబోది బోమంటున్నారు. మండలంలోని బూశాయవలస వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. రామభద్రపురం గ్రామానికి చెందిన రుద్రాక్షుల సత్యనారాయణ (దుర్గ), ఎస్. చింతలవలసకు చెందిన తలచుట్ల లక్ష్మున్నాయుడు ఇటుక ట్రాక్టర్‌లో రవాణా కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో శనివారం వేకువజామున ఇటుకల రవాణాకు బయలుదేరారు. రామభద్రపురం మీదుగా మామిడివలస వెళ్తుండగా.. బూశాయవలస మలుపు వద్ద ట్రాక్టర్ నిలిపివేశారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో ట్రాలీ మీద పడడంతో లక్ష్మున్నాయుడు, ఇంజిన్ మీద పడడంతో సత్యనారాయణ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తెల్లవారుజాము సమయంలో ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి.
రెండు గ్రామాల్లో విషాద ఛాయలు...
మండలంలోని ఎస్. చింతలవలస, రామభద్రపురం గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ఓ ప్రమాదంలో ఎస్.చింతలవలసకు చెందిన ఇద్దరు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే మళ్లీ అదే గ్రామానికి చెందిన లకు‡్ష్మనాయుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భర్త చనిపోవడంతో ఇక తనకు దిక్కెవరంటూ భార్య రాములమ్మ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.రామభద్రపురం కర్ణివీధికి చెందిన రుద్రాక్షుల సత్యనారాయణ (దుర్గ) మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడింది. కూలి చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి వారిది. ప్రమాదంలో సత్యనారాయణ మృతి చెందడంతో అతని భార్య సింహాచలం, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment