చెన్నై,టీ.నగర్: కోయంబత్తూరు విలాంకురిచ్చిలో సోమవారం రెండున్నరేళ్ల బాలిక బావిలో శవమై తేలింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. కోయంబత్తూరు అన్నూరు కరియ గౌండనూర్‌కు చెందిన కనకరాజ్, కాంచన దంపతులు విలాంగురిచ్చిలో గల కుప్పురాజ్ గార్డెన్‌లో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. కనకరాజ్ జేసీబీ వాహనం అద్దెకు ఇస్తుంటారు. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె అమృత ఉంది. ఆదివారం వీరి ఇంటికి బంధువులు వచ్చి ఉన్నారు. రాత్రి అందరు భోజనం చేసిన తర్వాత బిడ్డతో పాటు కాంచన, కనకరాజ్ ఇంట్లో నిద్రించేందుకు వెళ్లారు. ఇంటికి వచ్చిన బంధువులు కొందరు ఆరుబయట మంచాలపై నిద్రించారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బిడ్డ ఏడవడంతో పాలిచ్చి పడుకోబెట్టింది.
ఇలా ఉండగా సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కాంచన లేచి చూడగా బిడ్డ కనిపించక పోవడంతో దిగ్భ్రాంతి చెందింది. ఆ తర్వాత బిడ్డ కోసం బంధువులు, భర్త కనకరాజ్ తీవ్రంగా గాలించారు. అయితే బిడ్డ ఆచూకీ తెలియలేదు. ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో కరువేలంకాడు ప్రాంతంలో వెతికి చూడగా, అక్కడ ఉన్న పాడుబడిన బావిలో బిడ్డ కనిపించింది. వెంటనే బావిలోకి తాడు సాయంతో దిగి బిడ్డను వెలికి తీశారు. బిడ్డ స్పృహతప్పి ఉండవచ్చని భావించి వెంటనే సమీపాన గల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే పరిక్షీంచిన వైద్యులు పాప మృతి చెందినట్లు తెలిపారు. దీని గురించి సమాచారం అందుకున్న పీలమేడు పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment