ప్రతీకాత్మక చిత్రం
మెదక్ మున్సిపాలిటీ : రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్‌ఓకు రెండేళ్ల జైలు, రూ. 6వేల జరిమానా విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ మండలం గొల్లగడ్డ గ్రామం జీడిపల్లి పంచాయతీకి చెందిన పయ్యాల శంకర్‌కు అదే గ్రామ శివారులోని సర్వే నం. 128లో 2.15 ఎకరాల భూమి ఉంది.
దాని మ్యూటేషన్ చేయించేందుకు తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయంలో శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. పేరు మార్చాలంటే రూ.5వేలు లంచం ఇవ్వాలని వీఆర్‌ఓ వెంకట కిషన్‌రావు డిమాండ్ చేశాడు. దీంతో రైతు శంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని రైతు శంకర్ నుంచి వీఆర్‌ఓ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటి నుంచి కేసు హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టులో కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం కోర్టులో కేసు విచారణకు రాగా వీఆర్‌ఓ వెంకట కిషన్‌రావుపై నేరం రుజువు కావడంతో అతడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 6వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు తెలిపారు. జరిమానా చెల్లించకుంటే మరో 3నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment