ప్రతీకాత్మక చిత్రం
బళ్లారి : కుటుంబానికి ఆసరాగా ఉందామని, వేసవి సెలవుల్లో నాలుగు డబ్బులు సంపాదించుకుందామని ఉపాధి పనులు చేస్తున్న ఇద్దరు యువకులను పిడుగుపాటు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీరని శోకం నింపింది. పిడుగుపాటుకు గురై ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. సోమవారం బళ్లారి జిల్లా హరపనహళ్లి తాలూకా చిగటేరి గ్రామంలో పిడుగుపాటుకు గురై అరవింద్ (18), కిరణ్ (20) అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద స్వగ్రామం చిగటేరి చెరువులో కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఉదయమే భారీ ఎత్తున ఈదురుగాలులతో పాటు వర్షం ప్రారంభమైంది.
ఈ సమయంలో వారికి దగ్గరగా పెద్దశబ్ధంతో పిడుగుపడింది. దీంతో చెరువులో పనులను చేస్తున్న అరవింద్, కిరణ్‌లు కుప్పకూలిపోయారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని యువకులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే విగతజీవులు కావటంతో కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలను సేకరించారు. ఉపాధి కూలీ పనుల కోసం వెళ్లి మృతి చెందడంతో ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు అధికారులను విన్నవించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment