మార్చురీలో మృతదేహాలు
ఖమ్మంక్రైం : సాగర్ కాల్వలో గల్లంతైన ఆ అన్నాతమ్ముడు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు గురువారం దొరికాయి. తమ బిడ్డలిద్దరూ విగతులుగా బయటకు వస్తున్న దృశ్యాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.
6వ తేదీన గల్లంతు...
రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామానికి చెందిన నిరుపేదలైన బలంతు కృష్ణ–సీతమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితం నగరంలోని వికలాంగుల కాలనీకి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు నాగరాజు(21), చంటి(18), కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరూ కూలీనాలీ పనులు చేస్తున్నారు. వీరిద్దరూ 6వ తేదీన పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చారు. బహిర్భూమికని, తమ ఇంటికి సమీపంలోగల సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. నీళ్లలోకి దిగుతున్నారు. ప్రమాదవశాత్తు కాలు జారడంతో నీటిలో చంటి పడిపోయాడు. తమ్ముడిని రక్షించేందుకు నాగరాజు ప్రయత్నించాడు. అతడు కూడా నీటిలో పడిపోయాడు. ఇద్దరూ గల్లంతయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కొందరు గమనించారు. కాపాడేందుకు ప్రయత్నించారు. ప్చ్.. వారి ప్రయత్నం విఫలమైంది.
విస్తృతంగా గాలింపు
తమ కొడుకులిద్దరూ గల్లంతయ్యారన్న వార్తతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. కుటుంబీకులు, బంధువులతో కలిసి కాల్వ వద్దకు వచ్చారు. అప్పటికే రాత్రవడంతో గాలింపు చేపట్టలేదు. మరుసటి రోజు (7వ తేదీన) ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపుగా 50మంది గత ఈతగాళ్లు విస్తృతంగా గాలించారు. జాడ తెలియలేదు. ఆ తల్లిదండ్రుల్లో ఏదో చిన్న ఆశ.. ‘ఆ దేవుడు కరుణిస్తాడేమో... బతకనిస్తాడేమో..’ అని! తమ మనసులో ఆ ముక్కోటి దేవతలను వేడుకున్నారు.. ఆ ఇద్దరు బిడ్డలను క్షేమంగా తిరిగివ్వాలని..!!
శవాలుగా తిరిగొచ్చారు..
ఆ తల్లిదండ్రుల వేదనను ఏ ఒక్క దేవుడుగానీ, దేవతగానీ ఆలకించలేదేమో..! ఆ ఇద్దరు బిడ్డలు ప్రాణాలొదిలారు. తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేసి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. టేకులపల్లి వద్ద నాగరాజు మృతదేహం దొరికింది. ఆ తరువాత పది నిమిషాలకే చంటి మృతదేహం కూడా అక్కడకు దగ్గరలోనే కనిపించింది. సామాజిక సేవకుడైన అన్నం శ్రీనివాస్‌రావు, తన బృందంతో కలిసి సాగర్ కాల్వ వద్దకు చేరుకున్నారు. ఆ ఇద్దరి మృతదేహాలను నగరంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను రఘునాథపాలెం మండలంలోని కోటపాడుకు తరలించారు. చెట్టంట కొడుకులు ఇద్దరినీ ఒకేసారి కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment