
సాక్షి, ఆదోని: మద్యానికి బానిసై నిత్యం కుమార్తెను వేధిస్తూ నరకం చూపిస్తున్న అల్లుణ్ని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ సంఘటన కర్నూల్ జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పెద్ద తుంబళం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ హుసేన్‌బాష తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసులు(48) నిత్యం మద్యం తాగుతూ భార్యా పిల్లలను చిత్ర హింసలకు గురి చేసేవాడు. శనివారం కూడా తప్పతాగి పొలంలో పనిచేస్తున్న భార్య లక్ష్మి వద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు.
దీంతో మామ వెంకటస్వామి వెనుక నుంచి ఇనుప రాడ్‌తో అతని తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆదోని తాలూకా సీఐ దైవ ప్రసాద్, పెద్ద తుంబళం ఎస్‌ఐ హుసేన్‌బాషా సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
శ్రీనివాసులుకు భార్య లక్ష్మితో పాటు నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అతని సొంతూరు ఆదోని మండలం దిబ్బనకల్లు గ్రామం. 20 ఏళ్ల క్రితం కుప్పగల్‌కు చెందిన లక్ష్మితో వివాహమైంది. వీరు బతకడం కోసం తరచూ వలస వెళ్లేవారు. ఇటీవల లక్ష్మి పుట్టినింట్లో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో అల్లుడు తరచూ గొడవ పడేవాడని, అతని చేష్టలు భరించలేక మామ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment