లక్నో : తమ సోదరి చావుకు కారణమైన అయిదుగురిని చంపడమే సరైన శిక్ష అని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి సోదరుడు స్పష్టం చేశారు. నిందితులకు వేరే ఏ శిక్ష వేసిన ప్రయోజనం లేదని, చంపడం వల్లనే తమకు న్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుల చేతిలో పెట్రోల్ దాడికి గురై ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నావ్ బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బాదితురాలి సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరి ఇక తమతో లేరని, ఆమె చావుకు కారణమైన అయిదుగురు నిందితులు (శివం త్రివేది, శుభం త్రివేది, హరి శంకర్ త్రివేది, రాంకిషోర్ త్రివేది, ఉమేశ్ బాజ్‌పాయ్)లను చంపేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం కోర్టు విచారణ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న యువతిని నిందితులు అపహరించి పెట్రోల్ పోసి నిప్పటించి పరారయ్యారు. తమపై కేసు పెట్టిందన్న అక్కసుతోనే నిందితులు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. కాగా ఈ ఘటన అనంతరం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: అత్యాచారాలకు రాజధానిగా భారత్: రాహుల్
మరోవైపు బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. నిందితులకు సరైన శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ కుమార్తెను పెట్రోల్ పోసి తగలబెట్టిన ఐదుగురినీ పోలీసులు కాల్చి చంపినప్పుడే ప్రశాంతంగా ఉంటానని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి నిందితుల నుంచి ప్రమాదం ఉందని, వారు అనేకసార్లు తమను బెదిరించారని చెప్పినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. గ్రామంలో వారిని ఎదిరించే ధైర్యం ఎవరికి లేదని ఆయన తెలిపారు. ఇక ఉన్నావ్ బాధితురాలు మరణించడం దురదృష్టమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. నిందితులందరిని అరెస్టు చేశామని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టామని తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. దోషులను ఎన్‌కౌంటర్ చేయడమే సరైన మార్గమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment