లక్నో/కాన్పూర్: ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనుచరుల్లో ఒకడిని పోలీసులు అరెస్టు చేశారు. దుబే గ్యాంగ్‌లో పనిచేసే దయా శంకర్ అగ్నిహోత్రిని కాన్పూర్ నగరం సమీపంలోని కల్యాణ్‌పూర్‌లో శనివారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసే క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయని, ఆ క్రమంలో అగ్నిహోత్రి కుడి కాలుకు బుల్లెట్ గాయమైందని పేర్కొన్నారు. కాగా, పోలీసులపై కాల్పుల ఘటనలో వికాస్ దుబేతోపాటు 18 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాన నిందితుడు వికాస్ దుబే తలపై రూ.50 వేలు రివార్డు, అగ్నిహోత్రి తలపై రూ.25 వేలు రివార్డు పోలీసుల ఇదివరకే ప్రకటించారు.
(చదవండి: గ్యాంగ్‌స్టర్ ఇల్లు కూల్చివేత, సరళాదేవీ విచారం)
పోలీసుల విచారణలో అగ్నిహోత్రి కీలక సమాచారం వెల్లడించినట్టు తెలిసింది. దుబేను పట్టుకునేందుకు పోలీసులు వస్తున్న సంగతి తమకు ముందే తెలుసని అగ్నిహోత్రి విచారణలో చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ నుంచి సమాచారం అందిందని నిందితుడు వెల్లడించినట్టు పోలీసులు చెప్పారు. కాగా, కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి కాల్పుల ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అనంతరం మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నేరస్తులను పోలీసులు హతమార్చారు. కరుడుగట్టిన నేరగాడైన వికాస్ దూబేపై 60కి పైగా కేసులున్నాయి.
(చదవండి: వికాస్ దూబేకు సాయం.. పోలీస్ అధికారిపై వేటు)
Comments
Please login to add a commentAdd a comment