కార్మికులపై దాడికి పాల్పడుతున్న వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు కొట్టిన దెబ్బలను చూపుతున్న కార్మికులు
నిర్మల్: పారిశుధ్య కార్మికులపై కూరగాయల వ్యాపారులు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. మున్సిపల్ కమిషనర్ ఎదుటే మూకుమ్మడిగా పిడిగుద్దులు గుద్దారు. జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్‌లో గల గాంధీ కూరగాయల మార్కెట్‌లో గురువారం పొద్దునే ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకేంద్రంలోని గాంధీ మార్కెట్‌లో ఇటీవల నూతనంగా షెడ్లను నిర్మించారు. ఇప్పటికే ఇందులో కొంత మంది వ్యాపారులు కూరగాయల విక్రయాలు ప్రారంభించారు. చాలామంది ఎప్పటిలాగే రోడ్డుపైనే కూరగాయలు అమ్ముతున్నారు. దీంతో ప్రధాన మార్గంగా ఉన్న ఈ దారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈనేపథ్యంలో వ్యాపారులందరూ మార్కెట్ ఆవరణలోనే కూరగాయలను విక్రయించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు సూచించారు.
అయినా ఫలితం లేకపోవడంతో గురువారం ఉదయం ఐదు గంటలకే సిబ్బందితో కలిసి కమిషనర్ మార్కెట్ వద్దకు చేరుకున్నారు. అరగంట పాటు సమయం ఇస్తున్నామని, కూరగాయల బుట్టలను మార్కెట్ ఆవరణలోకి తరలించాలని చెప్పారు. అప్పటికీ వ్యాపారులు కదలకపోవడంతో పారిశుధ్య కార్మికులు కూరగాయల బుట్టలను తరలించేందుకు ఉపక్రమించారు. ఇంతలో సంబంధిత వ్యాపారులు మూకుమ్మడిగా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ సిబ్బందికీ గాయాలయ్యాయి.
విచక్షణారహితంగా..
రోడ్డుపైన ఉన్న కూరగాయలు, బుట్టలను లోపలికి తరలించేందుకు మున్సిపల్ కార్మికులు ట్రాక్టర్‌ను తీసుకువచ్చారు. కమిషనర్ రవిబాబు, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురహరి, శానిటరీ జవాన్ సురేందర్‌ల సహకారంతో కూరగాయల ట్రేలు, బుట్టలను లోపలికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలో ట్రాక్టర్ డ్రైవర్ మామెడ గంగాధర్, కార్మికులు గంగయ్య, సురేశ్‌పై వ్యాపారులు దాడికి తెగబడ్డారు. పారిశుధ్య కార్మికుడు సురేశ్‌పై షబాజ్‌ఖాన్ గొంతుపై చేయిపెట్టి ట్రాక్టర్‌పైనుంచి నెట్టివేశాడు. గంగయ్య అడ్డురాగా, అతనిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో డ్రైవర్ గంగాధర్ వారిని ఆపడానికి ప్రయత్నించగా.. మిగతా వ్యాపారులంతా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కార్మికులను ఇష్టానుసారంగా తిడుతూ.. విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దారు. కూరగాయల ట్రేలతోనూ దాడికి పాల్పడ్డారు. ట్రాఫిక్ సిబ్బంది, మిగతా మున్సిపల్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నించినా వ్యాపారులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బందికీ గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ గంగాధర్ పెదవి చిట్లింది. మిగతా ఇద్దరు కార్మికులకూ తీవ్రగాయాలయ్యాయి.
కమిషనర్ ఎదుటే దాడి..
మార్కెట్‌లో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన కమిషనర్ రవిబాబు ఎదుటే వ్యాపారులు మున్సిపల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా నివ్వెరపోయిన కమిషనర్ తమ సిబ్బందితో బాధితులను బయటకు తీసుకొచ్చి.. నేరుగా తమ బల్దియా వాహనాలతో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి వద్దకు చేరుకున్నారు. జరిగిన ఘటనను ఆయనకు వివరించి, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి పట్టణ పోలీసులకూ దీనిపై ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి నేరుగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వద్దకూ వెళ్లి.. జరిగిన ఘటనపై వెంటనే స్పందించేలా చూడాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకునేలా చూస్తానని మంత్రి హామీఇచ్చారు. సిబ్బంది దాడిచేయడం ఏమాత్రం సరికాదని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తామని ఆయన చెప్పడంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దాడిలో కో–ఆప్షన్ సభ్యుడు..
మున్సిపల్ కార్మికులపై దాడిచేసిన ఘటనలో బల్దియా కో–ఆప్షన్ సభ్యుడు ఎస్‌కే బహదూర్‌ఖాన్ కూడా ఉన్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. తమపై దాడికి పాల్పడిన వారిపై వారు పోలీసులకు కంప్‌లైంట్ ఇచ్చారు. ఇందులో షబాజ్‌ఖాన్, ఎస్‌కే బహదూర్‌ఖాన్, షబీర్‌ఖాన్, అమర్, షబ్బీర్, యూనిస్, సల్మాన్, జాబిర్, సోహెబ్ తమపై దాడికి పాల్పడినట్లు కార్మికులు పేర్కొన్నారు. తీవ్రపదజాలంతో, కులం పేరుతో దూషించారని, ఇష్టానుసారంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులను నమోదు చేయాలని తెలిపారు.
అరెస్టు చేయకపోవడంతో ఆందోళన..
పొద్దున దాడి జరిగితే.. సాయంత్రం వరకూ పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, తమపై దాడిచేసిన వారిని అరెస్టు చేయకపోవడంపై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే తమ కార్మికులపై దాడి చేశారన్న విషయం తెలియడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది అంతా బల్దియాకు చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ సాయంత్రం బల్దియా ఎదుటే టెంటు వేసుకుని బైఠాయిం చారు. వారికి కమిషనర్ రవిబాబు కూడా మద్దతుగా బైఠాయించారు. తమ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి అట్రాసిటీ తదితర కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ జాన్‌దివాకర్ అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. నిందితులను పట్టుకోకుండా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై జులుం చేయడమేంటంటూ ఎదురుతిరిగారు. ఈ క్రమంలో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి అక్కడి చేరుకున్నారు. మున్సిపల్ కమిషనర్ రోడ్డుపై బైఠాయించి రాకపోకలకు ఇబ్బంది కలిగించడమేంటంటూ మండిపడ్డారు. తాము తమ కార్యాలయం ఎదుటే బైఠాయించామని, పక్కనే మరో మార్గం రాకపోకలకు ఉందని కమిషనర్ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. టీఎన్‌జీవో తదితర సంఘాల నాయకులు వారిద్దరికీ సర్దిచెప్పారు. తన సర్వీసులో ఇలాంటి కమిషనర్‌ను చూడలేదని, తనపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేస్తానని ఈ సందర్భంగా డీఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల అందిన వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు. అప్పటి వరకు కార్మికులు సహకరించాలన్నారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ తమ పైఅధికారులకు సంఘటన గురించి తెలిపినట్లు పేర్కొన్నారు. కార్మికులు, తమ సిబ్బందిని భయపెట్టేలా పోలీసు అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు.
సేవలు నిలిపివేస్తున్నాం..
కార్మికులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని కమిషనర్ రవిబాబు, మున్సిపల్ డీఈఈ సంతోష్ ప్రకటించారు. సాయంత్రం ఆరుగంటలకు తమ నిరసనను నిలిపివేశారు. తిరిగి శుక్రవారం కొనసాగిస్తామని చెప్పారు. కార్మికుల నిరసనలో భాగంగా పట్టణంలో మున్సిపాలిటీ సేవలు కూడా నిలిచిపోనున్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ రీజినల్ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్లామని కమిషనర్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులపైన దాడి, వారి నిరసన నేపథ్యంలో శుక్రవారం తాగునీటి సరఫరా, చెత్తసేకరణకు అటంకం కలిగే పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ ఆందోళనకు టీఎన్‌జీవోల సంఘం, పలు కార్మిక సంఘాల నాయకులు మద్దతు పలికారు. టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు రవి, రాజన్న పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఘటన గురించి తెలిసినా.. పాలకవర్గం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment