సాక్షి, సిటీబ్యూరో: ‘అరవింద సమేత వీర రాఘవ’ కేసు కొలిక్కిరాకముందే మరో సినిమా ‘ట్యాక్సీవాలా’ వంతు వచ్చింది. ఆ చిత్రానికి సంబంధించిన నిర్మాణ దృశ్యాలు లీక్ కాగా... ఈ సినిమా ఎడిటిం గ్ సైతం కాకముందే హెచ్‌డీ ప్రింట్ నెట్‌కెక్కింది. నిర్మాణ సంస్థ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘ట్యాక్సీవాలా’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎడిటింగ్‌కు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్‌డీ ప్రింట్‌తో పూర్తి సినిమాను యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అప్‌లోడ్ చేసి వైరల్ చేశారని నిర్మాణ సంస్థ గుర్తించింది.
దీంతో దాని ప్రతినిధి సానం నాగ అశోక్‌కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ చాంద్‌బాషా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే తాము తెలుగు ఫిలిమ్ చాంబర్ ఆధీనంలోని యాంటీ వీడియో పైరసీ సెల్‌కు ఫిర్యాదు చేశామని, వారి ద్వారా కీలక సమాచారం సేకరించామని ఫిర్యాదులో పేర్కొన్న నిర్మాణ సంస్థ ఆయా లింకుల్ని సైతం సైబర్ క్రైమ్ పోలీసులకు అందించింది. గూగుల్ డ్రైవ్‌ల నుంచి ఈ సినిమా షేర్ అవుతోందని పేర్కొన్నారు. రెల్ల కమల్, భార్గవ్‌కుమార్, బీఆర్ పేర్లతో ఉన్న జీ–మెయిల్ ఐడీలకు సంబంధించిన డ్రైవ్ అకౌంట్ల ద్వారా లింకులు షేర్ అవుతున్నాయంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘గీత గోవిందం’ సినిమా కూడా లీకైన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment