సాక్షి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జిల్లా కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ముట్టడి సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండేటి శ్రీధర్‌లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ముట్టడి సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాలలో అవకతవకలు జరిగి 5 రోజులు గడిచినా దొర మాత్రం ఎమ్మెల్యేలను కొనే బిజిలో ఉన్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు.
20 మంది విద్యార్థులు చనిపోయినా చలనం లేదా దొర.. దొర ఇక నీ ఆటలు సాగవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలు చాలా బాధాకరమన్నారు. విద్యార్థులు అధైర్య పడవద్దని, వారి కోసం తాము ఉన్నామన్నారు. ఇంటర్ విద్యార్ధుల కోసం ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నేతలు, కార‍్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment