సాక్షి, విజయవాడ: ఫేక్ ఐడీ సృష్టించి.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి దర్జాగా తిరుగుతున్న నకిలీ ఎస్‌ఐకి భవానీపురం పోలీసులు అరదండాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గుత్తాల ప్రశాంత్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఛానల్ లో కరెస్పాండెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి రెగ్యులర్ గా తిరిగే ప్రశాంత్ కి కోవిడ్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. చెక్ పోస్టుల వద్ద చెకింగ్ తప్పించుకొనేందుకు, టోల్ ప్లాజా వద్ద ఫీజు ఎగ్గొట్టేందుకు పోలీస్ అవతారం ఎత్తాడు. సైబరాబాద్ సిటీ ఎస్ఐ గా ఫేక్ ఐడీ సృష్టించాడు. కారు నంబర్ ప్లేట్ కూడా మార్చేశాడు. AP 05 DP 5911 గా ఉన్న కార్ నంబర్ ను TS 08 DP 5911 గా మార్పు చేసి దర్జాగా తిరిగేస్తున్నారు. ఆపిన చోటల్లా ఎస్ఐ ని అంటూ బిల్డప్ ఇచ్చి ఖాకీలకే కుచ్చుటోపీ పెట్టాడు. (24 రోజులు...12 హత్యలు!)
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి చెక్ పోస్టులు దాటుకొని వచ్చిన ప్రశాంత్ ని వాహన తనిఖీలు చేస్తున్న భవానీపురం పోలీసులు చెక్ చేశారు. ఐడీ కార్డు తేడా గా ఉండటంతో అదుపులోకి తీసుకొన్నారు. ఖాకీ మార్కు ట్రీట్ మెంట్ ఇవ్వటం తో నకిలీ ఎస్‌ఐ వాస్తవాలను వెళ్లగక్కాడు. ప్రశాంత్ కి గతం లో కూడా నేర ప్రవృత్తి ఉందా, పాత కేసులు ఉన్నాయా, ఎస్ఐ పేరు తో ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాడు, అతను చెప్పిన కారణాలు ఎంతవరకు నిజం, అక్రమ దందా ఏమైనా చేస్తున్నాడా అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐపీసీ 170 ,419 ,465 ,468 ,471 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. (పోలీసునంటాడు.. సెల్‌ఫోన్లతో ఉడాయిస్తాడు)
Comments
Please login to add a commentAdd a comment