కేసు వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖరరావు, ఎస్‌ఐ డి.దీనబంధు(ఇన్‌సెట్‌లో) మృతుడు దేముడబ్బాయి(ఫైల్)
సబ్బవరం(పెందుర్తి): మండలంలోని అమృతపురం శివారులో ఇటీవల లభ్యమైన కాలిన గుర్తు తెలియని యువకుని మృతదేహం కేసును సబ్బవరం పోలీసులు 7 రోజుల్లో ఛేదించారు. దొంగిలించిన సొమ్ము రూ.40 వేలు తిరిగి ఇవ్వలేదని ఓ ఆటో డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తేల్చారు. సీఐ చంద్రశేఖరరావు, ఎస్‌ఐ దీనబంధు శుక్రవారం ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 19 అర్ధరాత్రి సమయంలో అమృతపురం శివారు అమ్మరపిండివానిపాలెం సమీపంలో విధులు నిర్వహిస్తున్న గెయిల్ పైప్‌లైన్ సెక్యూరిటీ సిబ్బంది.. కాలిన మృతదేహాన్ని గుర్తించి 20న సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విషయం పత్రికల్లో రావడంతో 23న అనంతగిరి మండలం కోరపర్తి గ్రామానికి చెందిన మృతుడి తండ్రి దారపర్తి పోతురాజు తన కుమారుడు కనిపించడం లేదంటూ సబ్బవరం పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలంలో మృతదేహం వద్ద లభ్యమైన ఆధారాలు చూసి తన కుమారుడు దేముడబ్బాయి(19)గా గుర్తించారు.
నిందితుడ్ని పట్టించిన ఫోన్ నంబర్
మృతుని వివరాలు తెలియడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దేముడు తండ్రిని ప్రశ్నించగా.. తనకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, మీ అబ్బాయి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని, చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అవసరమైతే చంపేస్తానని బెదిరించినట్టు చెప్పాడు. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా గురువారం ఉదయం 11.15 గంటలకు ఆటో డ్రైవర్ జొన్నాడ నర్సింహమూర్తి(30)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించడంతో హత్య చేసినట్టు అంగీకరించాడు. చీడికాడ మండలం తంగుడుబిల్లికి చెందిన నర్సింహమూర్తి గాజువాక సమీప శ్రీనగర్‌లోని సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్నాడు. నవంబర్ చివరిలో తన రూమ్‌లో రూ.40 వేలు పోయింది. ఆ పక్క గదిలో రామకృష్ణ, దేముడబ్బాయి అద్దెకు ఉంటున్నారు. దేవరాపల్లికి చెందిన రామకృష్ణకు మెకానిక్ షెడ్ ఉంది. అందులో పని చేస్తున్న జగదీష్ అనే వ్యక్తికి దేముడబ్బాయి స్నేహితుడు కావడంతో పరిచయంతో కలిసి ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉంటున్నారు.
దొంగతనానికి నాలుగు రోజుల కిందటే ఆ గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే దొంగతనం జరిగిన నాటి నుంచి దేముడబ్బాయి కనిపించడం లేదు. నర్సింహమూర్తి డబ్బులు పోవడంతో గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం పక్క గదిలో ఉంటున్న రామకృష్ణను ఆరా తీశాడు. ఈ నెల 16న కొత్తవలసలో కనిపించిన దేముడబ్బాయిని 17న తీసుకెళ్లి నర్సింహమూర్తికి అప్పగించాడు. దేముడును గాజువాక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తానని చెప్పి, నర్సింహమూర్తి తన గదికి తీసుకెళ్లి బంధించి, దేహశుద్ధి చేశాడు. దీంతో తన వద్ద ఉన్న రూ.10 వేలు మాత్రమే ఇచ్చి మిగతా రూ.30 వేలు ఇవ్వలేకపోయాడు. డబ్బులు విషయాన్ని దేముడు తల్లిదండ్రులకు నర్సింహమూర్తి ఫోన్ చేసి చెప్పినా వారు కుమారుడు తీరు తెలిసి పట్టించుకోలేదు. 19న మళ్లీ చిదకబాదడంతో కేకలు వినిపించి చుట్టు పక్కల వారు రావడంతో డబ్బులు విషయం మాట్లాడుతున్నానని చెప్పి పంపేశాడు.
ఆ దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన దేముడును అదే రోజు సాయంత్రం గోనె సంచిలో కట్టి ఆటోలో వెనక సీటులో వేసుకుని నర్సింహమూర్తి బయలుదేరాదు. ఆటోను నరవ మీదుగా జనసంచారం లేని అమృతపురానికి తీసుకొచ్చి దేముడుపై డీజిల్ పోసి నిప్పుపెట్టాడు. పినగాడి మీదుగా గాజువాక చేరుకున్న నిందితుడు నర్సింహమూర్తి.. మృతుని తల్లిదండ్రులకు అనుమానం రాకుండా ‘మీ కుమారుడిని వదిలేశాను డబ్బుల ఇచ్చేయండి’ అని చెప్పి ఫోన్ పెట్టేశా డని సీఐ తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభకనబరిచిన ఎస్‌ఐ దీనబంద్, ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు నాగేంద్ర, సాయి, నరసింగరావును అభినందించారు. నిందితుడిపై ఐపీసీ 302, 201 కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment