
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో జరుగుతున్న నకిలీ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నకిలీ ఆధార్, డాక్యుమెంట్స్, స్టాంప్స్ తయారు చేస్తున్న ముఠాను పసిగట్టి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. కోర్టులనే మోసం చేస్తూ న్యాయవాదుల సహకారంతో ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ముద్దాయిలకు పూచీకత్తు ఇచ్చే సమయంలో నకిలీ పత్రాలు సమర్పిస్తున్నట్లు, దాదాపు 150కిపైగా కేసులలో నకిలీ ప్రతాలను న్యాయవాదులు సమర్పించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నలుగురైదుగురు న్యాయవాదుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.
అత్యధికంగా గంజాయి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసలలో నకిలీ దందా సాగిస్తున్నట్లు, గంజాయి కేసులో పూచీకత్తులకు 20 వేలు, రోడ్డు ప్రమాద కేసులో 10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ పత్రాలతో కోర్టులను మోసం చేసి నిందితులను రక్షించారని, ఇతర రాష్ట్రాల నిందితులకు పూచీకత్తు కోసం నకిలీ పత్రాలు సృష్టించారని వెల్లడించారు. ఈ వ్యవహారం నాలుగు సంవత్సరాలుగా సాగుతోందన్నారు. గత భూదందా కేసులో రికార్డులు తారుమారుపై ఈ ముఠా పాత్ర ఏమైనా ఉందా అన్నది పరిశీలిస్తున్నమని తెలిపారు. అరెస్టు చేసిన 13 మందిలో ఒక రౌడీషీటర్ ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment