నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెడుతున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘గొర్రెకుంట’హత్యల వెనుక దాగిన మరో మిస్టరీ బయటపడింది. నింది తుడు సంజయ్‌కుమార్ యాదవ్(24) సాగించిన 9 హత్యల కిరాతకానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. తాను చేసిన ఒక హత్య గురించి ఎక్కడ పోలీసులకు చెబుతారోనన్న భయంతోనే మిగిలిన వారిని అతను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పది హత్యలను నింది తుడు ఒకే రీతిలో అందరికీ నిద్రమాత్రలు ఇచ్చి వారు నిద్రలోకి జారుకున్నాకే చేయడం యావత్ రాష్ట్రాన్ని గగుర్పాటుకు గురిచేసింది. వరంగల్ నగర శివారు గీసుగొండ మండలంలోని గొర్రెకుంటలో ఓ వ్యవసాయ బావిలో 9 మంది హత్య కేసును వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 21న లభించిన నాలుగు, 22న లభించిన ఐదు మృతదేహాలు కలిపి తొమ్మిది మందిని నిందితుడు సంజయ్ హత్య చేసి బావిలో పడేశాడని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇందుకుగల కారణాన్ని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
ఒంటరి మహిళకు దగ్గరై...
జీవనోపాధి కొసం ఆరేళ్ల క్రితం బిహార్ నుంచి వరంగల్ చేరుకున్న సంజయ్ కుమార్ యాదవ్ మిల్స్ కాలనీ ప్రాంతంలోని శాంతినగర్‌లోని గోనె సంచులు తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. 20 ఏళ్ల కిందటే పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి కరీమాబాద్‌లో స్థిరపడి పడి ఇదే కేంద్రంలో పని చేస్తున్న మహ్మద్ మక్సూద్ ఆలం (47) కుటుంబ సభ్యులతో అతనికి పరిచయమైంది. మక్సూద్‌తోపాటు ఇంట్లో ఆయన భార్య నిషా ఆలం(40), కూతురు బుష్రా ఖాతూన్ (20), కుమారులు మహ్మద్ షాబాజ్ ఆలం (19) మహ్మద్ సోహిల్ ఆలం (18), మనవడు (3), ఉండేవారు. ఆ పక్కనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా (37) ముగ్గురు పిల్లలతో ఉండేది. మక్సూద్ కుటుంబంతోపాటు రఫీకాతో కూడా సంజయ్‌కు పరిచయం ఏర్పడింది. రఫీకాకు డబ్బిస్తూ సంజయ్ ఆమె ఇంట్లోనే భోజనం చేసేవాడు. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉన్న రఫీకాకు నిందితుడు సంజయ్ మరింత దగ్గర కావడంతోపాటు కొద్ది రోజుల అనంతరం రఫీకాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అదే క్రమంలో గీసుగొండ మండలం జాన్‌పాక స్తంభంపల్లి ప్రాంతంలో రెండు గదుల ఇంటిని అద్దెకు తీసుకొని రఫీకా ఆమె ముగ్గురు పిల్లలతో కలసి నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నాడు.
రఫీకా కూతురుపై కన్ను...
రఫీకాతో సహజీవనం చేస్తున్న సంజయ్ ఇదే క్రమంలో యుక్త వయసుకు వచ్చిన రఫీకా కుమార్తెపై కన్నేసి.. ఆమెతో చనువుగా ఉండటానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన రఫీకా.. సంజయ్‌తో పలుమార్లు గొడవ పడింది. అయినా సంజయ్ తన పద్ధతి మార్చుకోకుండా మరింత సన్నిహితంగా వ్యవహరిస్తుండంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో ఎలాగైనా రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సంజయ్ తమ పెళ్లి విషయాన్ని బంధువులతో చెప్పేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్దామని రఫీకాను తీసుకొని మార్చి 6న విశాఖపట్నం వైపు వెళ్లే గరీబ్‌రథ్ రైల్లో వరంగల్ నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో మజ్జిగ ప్యాకెట్లు కొనుగోలు చేసి అప్పటికే తనతో తెచ్చుకున్న నిద్రమాత్రలను అందులో కలిపి రఫీకాకు ఇచ్చాడు. కుట్రలో భాగంగానే రఫీకాతో కలసి రైలు పుట్‌బోర్డ్ వద్ద కూర్చొని మాట్లాడసాగాడు. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో రైలు ఏపీలోని నిడదవోలు సమీపంలోకి రాగానే తాను వేసుకున్న ప్రణాళిక ప్రకారం మత్తులో ఉన్న రఫీకాను ఆమె చున్నీతోనే గొంతు బిగించి చంపి రైల్లోంచి తోసివేశాడు. దీనికి సంబంధించి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు నంబర్ 19/2020 ద్వారా నమోదు చేశారు. రఫీకా చనిపోయిందని నిర్ధారించుకున్నాక రాజమండ్రి స్టేషన్‌లో దిగి తిరిగి మరో రైల్లో సంజయ్ వరంగల్ చేరుకున్నాడు. రఫీకా పశ్చిమ బెంగాల్‌లోని తమ బంధువులు ఇంటికి వెళ్లినట్లు ఆమె పిల్లలను నమ్మించాడు.
ఆ హత్యను కప్పిపుచ్చుకునేందుకే ‘గొర్రెకుంట’పథకం...
కొద్ది రోజుల అనంతరం తన అక్క కుమార్తె రఫీకా బంధువుల ఇళ్లలో లేదని, రఫీకా ప్రస్తుతం ఎక్కడ ఉందో చెప్పాలని మక్సూద్ ఆలం భార్య నిషా ఆలం.. సంజయ్‌ను నిలదీయడంతోపాటు పోలీసులకు చెబుతానని బెదిరించసాగింది. దీంతో కంగుతున్న సంజయ్ పోలీసులకు చిక్కుతానని భయపడి మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలంను హత్య చేయాలని తొలుత నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రఫీకాను చంపినట్లుగానే నిద్రమాత్రలతో కలిపి చంపాలని ప్రణాళిక రూపొందించాడు. ప్రణాళికను అమలు పర్చడంలో భాగంగా ఈ నెల 16 నుంచి 20 వరకు మక్సూద్, ఆయన కుటుంబం పని చేస్తున్న గొర్రెకుంటలోని గోనెసంచుల తయారీ గోదాంకు రోజూ వచ్చివెళ్లాడు. అదే సమయంలో గోదాం పరిసరాలను కూడా పరిశీలించి రెక్కీ నిర్వహించాడు. చివరకు మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలంను చంపి గోదాం పక్కనేపున్న పాడుబడిన వ్యవసాయ బావిలో పడేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 20న మక్సూద్ ఆలం మొదటి కుమారుడైన షాబాజ్ ఆలం పుట్టిన రోజని తెలియడంతో అదేరోజు చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఈ నెల 18న సంజయ్ వరంగల్ చౌరస్తాలోని రెండు, మూడు మెడికల్ షాపుల్లో 60కిపైగా నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. ఈ నెల 20న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో గోదాంకు చేరుకొని మక్సూద్ కుటుంబంతో చాలా సేవు ముచ్చటించాడు. తనకు అనుకూలంగా వున్న సమయంలో ఎవరికీ తెలియకుండా మొదట మక్సూద్ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. మక్సూద్ కుటుంబం ఉంటున్న ఇంటి పక్కనే ఉండే బిహార్ యువకులు శ్యాం, శ్రీరాంలు తాను వచ్చిన విషయాన్ని ఎవరికైనా చెబుతారేమోనని భయపడి వారు తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. దీంతో మక్సూద్, ఆయన భార్య నిషా ఆలం, కుమార్తె బుష్రా కాటూన్, కుమారులు షాబాజ్ ఆలం, సోహెల్ ఆలం, మూడేళ్ల మనుమడు... శ్యాం, శ్రీరాంలతోపాటు మక్సూద్ ఆహ్వానం మేరకు పుట్టినరోజు వేడుకకు వచ్చిన పశ్చిమ బెంగాల్‌వాసి మహమ్మద్ షకీల్ మత్తులోకి జారుకున్నారు. దీంతో ఆర్ధరాత్రి 12.30 నుంచి ఉదయం 5 గంటల మధ్య మత్తులో ఉన్న తొమ్మిది మందిని పాడుపడ్డ బావి వద్దకు ఒక్కరొక్కరినీ తీసుకెళ్లి పడేశాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక మక్సూద్ గది నుంచి వాల్‌మార్ట్ నుంచి తెచ్చిన కిరాణ సామానుతోపాటు వారి సెల్‌ఫోన్లు, షకీల్ పర్సు తీసుకొని తన ఇంటికి చేరుకున్నాడు.
సీసీ ఫుటేజీ, వాల్‌మార్ట్ సరుకులే కీలకం...
ఈ హత్యలపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేయగా వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. గోదాం, గొర్రెకుంట, వెంకట్రామ థియేటర్ చౌరస్తా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో స్తంభంపల్లిలోని సంజయ్ ఇంట్లో తనిఖీ చేయగా మక్సూద్ ఆలం ఇంట్లో మాయమైన వాల్‌మార్ట్ సరుకులు లభ్యమయ్యాయి. ఇలా కచ్చితమైన ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఇంట్లోనే ఉన్న సంజయ్‌కుమార్ యాదవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
ప్రత్యేక దర్యాప్తు బృందాలకు సీపీ అభినందనలు
ఈ కేసును ఛేదించడంలో శ్రమించిన వరంగల్ ఈస్ట్ జోన్ ఇన్‌చార్జి డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుగొండ, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్లు శివరామయ్య, పుల్యాల కిషన్, టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీ కోర్, సీసీఎస్ టీం ఇన్‌స్పెక్టర్లు జనార్దన్‌రెడ్డి, నందిరాం నాయక్, రాఘవేందర్, రమేష్‌కుమార్‌లతోపాటు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ అభినందించారు.
నిందితుడి వివరాలు
సంజయ్ కుమార్ యాదవ్ (24)
తండ్రి పేరు : పవన్‌రామ్, నుర్లపూర్ గ్రామం, బిగుసరాయ్ జిల్లా, బిహర్ రాష్ట్రం
ప్రస్తుత నివాసం : స్తంభంపల్లి (జాన్‌పాక), గీసుగొండ మండలం, వరంగల్ రూరల్ జిల్లా
మృతుల వివరాలు:
1. మహ్మద్ మక్సూద్ ఆలం (47), తండ్రిపేరు మక్పూల్, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్
2. మహ్మద్ నిషా ఆలం (40), భర్తపేరు మక్సూద్ ఆలం, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్
3. మహ్మద్ బుష్రా ఖాటూన్ (20), మక్సూద్ ఆలం కూతురు, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్
4. బిబ్లూ (03), మక్సూద్ ఆలం మనమడు
5. మహ్మద్ షాబాజ్ ఆలం(19), తండ్రి మక్సూద్ ఆలం, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్
6. మహ్మద్ సోహిల్ ఆలం(18), తండ్రి మక్సూద్ ఆలం, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్
7. మహ్మద్ షకీల్ (38), తండ్రి రోహిత్, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ అర్బన్
8. శ్యాం కుమార్ షా (18), తండ్రి లక్ష్మన్ షా, మంజులావూర్, బిహార్ రాష్ట్రం
9. శ్రీరాం కుమార్ షా (21), తండ్రి రామేశ్వర్ షా, జగ్‌మొహర్, నమన్తవూర్ జిల్లా, బిహార్
Comments
Please login to add a commentAdd a comment