
రాయగడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
ఒడిశా, రాయగడ: రాయగడకు 15 కిలోమీటర్ల దూరంలో పిప్పిలిగుడ గ్రామ పొలిమేరల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివాహానికి వెళ్లి తిరిగివస్తున్న ఓ ప్రైవేటు బస్సు బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. పిప్పిలిగుడ ప్రాంతానికి చెందిన 32 మంది ప్రజలు రామన్నగుడలో వివాహానికి వెళ్లేందుకు ప్రైవేటు బస్సును మంగళవారం బుక్ చేసుకున్నారు. వివాహం చూసుకొని తిరిగి ఇళ్లకు వస్తుండగా పిప్పిలిగుడ గ్రామానికి 200 మీటర్ల ముందు రాత్రి 9 గంటల సమయంలో బస్‌కు బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాయికొమండంగి(40) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో 31 మంది ప్రయాణిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకొన్న రాయగడ సమితి బీడీఓ రాజేంద్రమజ్జి, ఏబీడీఓ నరసింహ చరణ పట్నాయక్, తహసీల్దార్ ఉమాశంకర్ బెహరా, పిప్పిలిగుడ పీఈఓ పన్నాకుమార్, ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఒక ప్రైవేటు బస్సులో క్షతగాత్రులను రాయగడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమించడంతో వెంటనే బరంపురం తరలించారు. మరో ముగ్గురిని కొరాపుట్ మెడికల్ కళాశాలకు తరలించారు. కాగా, మృతిచెందిన వ్యక్తిని కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2 వేలు అందించారు. అలాగే మృతి చెందిన వ్యక్తి కుటుంబనికి రూ.20 వేల ఆర్థిక సహాయం, మృతుని భార్యకు పింఛన్ అందిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment