Break failure
-
Viral Video: బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన పల్సర్ బైక్
-
బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన పల్సర్ బైక్
సాక్షి, ఖమ్మం : నగరంలో సోమవారం రాత్రి బట్టల దుకాణంలోకి ఓ ద్విచక్రవాహనం దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు అతి వేగంగా పల్సర్ వాహనంపై కమాన్‌బజార్‌లోని రావిచెట్టు ప్రాంతానికి వచ్చాడు. అయితే, వాహనం బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో వాహనం దుకాణాంలోకి దూసుకెళ్లింది. ఆ సమయాన షాపులో కొనుగోలుదారులు ఉన్నప్పటికీ వారు తప్పుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. వన్‌టౌన్ పోలీసులు ద్విచక్రవాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. -
లోయలో పడిన ఫైరింజన్; సిబ్బందికి గాయాలు
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం మల్కాపురం మండలం యారాడ గ్రామం ఆదివారం విషాదం చోటుచేసుకుంది. యారాడ ఘట్‌రోడ్డు పై ఉన్న డాల్ఫిన్ కొండ దిగుతుండగా విశాఖ నావెల్ డక్ యార్డ్‌కు చెందిన ఫైర్ ఇంజన్ బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో ఫైరింజన్ అదుపుతప్పి ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫైర్ ఇంజన్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమ్మిత్తం వారందరినీ విశాఖలోని ఐఎన్ఎస్ కళ్యాణి ఆసుపత్రికి తరలించారు. నెవల్ డక్‌యార్డ్‌కు చెందిన కొందరు ఉద్యోగులు డాల్పిన్ కొండ మీద ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫైర్‌ఇంజన్‌తో నీళ్లు తీసుకెళుతుండగా బ్రేకులు ఫెయిలయ్యి ఈ ప్రమాదం సంబవించినట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. కాగా, గతంలో కూడా అనకాపల్లికి చెందిన రెండు స్కూల్ బస్సులు ఇక్కడే ప్రమాదానికి గురయ్యాయి. ఆ ఘటనలో 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులు రోజు యారాడ నుంచి సిందియా వరకు 8 ట్రిప్పుల మేర తిరుగుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రక్షణ గోడ ఏర్పాటు చేయాలని అక్కడి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
టిప్పర్ లారీ అదుపు తప్పి దారుణం..
-
బోయిన్‌పల్లిలో దారుణం..
హైదరాబాద్ : నగరంలోని బోయిన్పల్లి దారుణం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ అదుపు తప్పి ఆరేళ్ల పాప మీదకు దూసుకురావడంతో చిన్నారి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. హస్మత్‌పేట గల్లీలోకి కంకర లోడ్‌తో వచ్చిన టిప్పర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి లారీ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ లారీ అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటన స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు ఆందోళన చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి భారీ లోడ్‌తో కూడిన వాహనాలకు పగటి పూట నగరంలోకి అనుమతి లేకపోయినప్పటికీ.. కంకర లోడ్‌తో కూడిన టిప్పర్‌ను చిన్న గల్లీలోకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
మంచినీటి ట్యాంకరు బీభత్సం
విశాఖపట్నం, భీమునిపట్నం: మంచినీటి ట్యాంకరు వాహనానికి బ్రేకులు ఫెయిల్ కావడంతో బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భీమిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి ఎగువపేట వైపు దిగుతున్న జీవీఎంసీ మంచినీటి ట్యాంకరు బ్రేకులు ఫెయిల్ కావడంతో అతివేగంగా క్రిందకు దూసుకొచ్చింది. ఎగువపేట వేదిక వద్దకు వచ్చి వైజాగ్‌కు చెందిన ఓ వ్యక్తి నూకాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వచ్చి పార్కు చేసిన కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు›మీద కూడా ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలో ఇదే ప్రదేశంలో ఒక జీపు అదుపు తప్పడంతో ఇద్దరు చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రాణాపాయం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
బ్రేక్ ఫెయిల్ పెళ్లి బస్సు బోల్తా
ఒడిశా, రాయగడ: రాయగడకు 15 కిలోమీటర్ల దూరంలో పిప్పిలిగుడ గ్రామ పొలిమేరల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివాహానికి వెళ్లి తిరిగివస్తున్న ఓ ప్రైవేటు బస్సు బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. పిప్పిలిగుడ ప్రాంతానికి చెందిన 32 మంది ప్రజలు రామన్నగుడలో వివాహానికి వెళ్లేందుకు ప్రైవేటు బస్సును మంగళవారం బుక్ చేసుకున్నారు. వివాహం చూసుకొని తిరిగి ఇళ్లకు వస్తుండగా పిప్పిలిగుడ గ్రామానికి 200 మీటర్ల ముందు రాత్రి 9 గంటల సమయంలో బస్‌కు బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాయికొమండంగి(40) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో 31 మంది ప్రయాణిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొన్న రాయగడ సమితి బీడీఓ రాజేంద్రమజ్జి, ఏబీడీఓ నరసింహ చరణ పట్నాయక్, తహసీల్దార్ ఉమాశంకర్ బెహరా, పిప్పిలిగుడ పీఈఓ పన్నాకుమార్, ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఒక ప్రైవేటు బస్సులో క్షతగాత్రులను రాయగడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమించడంతో వెంటనే బరంపురం తరలించారు. మరో ముగ్గురిని కొరాపుట్ మెడికల్ కళాశాలకు తరలించారు. కాగా, మృతిచెందిన వ్యక్తిని కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2 వేలు అందించారు. అలాగే మృతి చెందిన వ్యక్తి కుటుంబనికి రూ.20 వేల ఆర్థిక సహాయం, మృతుని భార్యకు పింఛన్ అందిస్తామని అధికారులు తెలిపారు. -
కొండగట్టు ప్రమాదం వెలికితీసిన బస్సు
-
కొండగట్టు బస్సు ప్రమాదం.. కారణాలు ఇవే!
సాక్షి, జగిత్యాల : కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 62కు చేరింది. ఈ ఘటనలో మరో 38 మంది కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. కారణాలు ఇవే.. కొండగట్టు ఘాట్‌రోడ్డు లోయలో పడిన ఆర్టీసీ బస్సును అధికారులు గురువారం వెలికితీశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసిన అధికారులు.. ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఆర్టీసీ బస్సు కండిషన్లో లేకపోవడం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. 2007 మోడల్‌కు చెందిన ఆర్టీసీ బస్సు జీవితకాలంలో 12 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా.. ప్రమాదానికి గురైన బస్సు మాత్రం 14 లక్షల 95 వేల 116 కిలో మీటర్లు తిరిగిందని గుర్తించారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత బస్సును స్క్రాప్ (తుక్కు) కింద భావించి పక్కకు పడేయాలని, కానీ, స్క్రాప్‌గా భావించే బస్సును జగిత్యాల- శనివారంపేట రూటులో ఆర్టీసీ అధికారులు నడపడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెగ్యులర్ బస్సు, రెగ్యులర్ డ్రైవర్ అయినప్పటికీ కాలం చెల్లిన వాహనం కావడం.. ఘాట్‌రోడ్డులో సరిగ్గా బ్రేక్ వేయడానికి వీలుపడకపోవడంతో ప్రమాదం జరిగిందని విచారణ అధికారులు భావిస్తున్నారు. విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడం, బ్రేక్ రాకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండడం ఈ మహా విషాదానికి కారణమని వారు ప్రాథమికంగా తేల్చినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగానూ సహాయం అందజేస్తాం కరీంనగర్లో చికిత్స పొందుతున్న 36మందిని మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ గురువారం పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా రూ. ఐదు లక్షలు, ఆర్టీసీ పరంగా రూ. 3 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి ఈటల తెలిపారు. గాయపడ్డవారికి రెండున్నర లక్షల చొప్పున సహాయం అందిస్తామన్నారు. వారు పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వపరంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో తొమ్మిది మందికి రైతు బంధు జీవిత భీమా వర్తిస్తుందని, ఇక, పార్టీ సభ్యత్వం ఉన్న వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. రైతుబంధు, పార్టీ సభ్యత్వం వర్తించని వారికి టీఆర్ఎస్ పార్టీపరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. -
ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం
సాక్షి, వీరవాసరం(పశ్చిమగోదావరి జిల్లా) : నరసాపురం - గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలుకు ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది. వీరవాసరం చేరేసరికి ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. బ్రేక్ స్ట్రక్ అవడంతో ఇంజిన్ వద్ద పొగలు వచ్చాయని గుర్తించిన సిబ్బంది, పెన్నాడ వద్ద రైలును నిలిపి అరగంట పాటు మరమతులు చేశారు. తర్వాత రైలు బయలుదేరింది. గండం తప్పడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
స్కూల్ బస్ బ్రేక్ ఫెయిల్
శ్రీకాకుళం , కవిటి: కంచిలిలోని ఓ పేరుపొందిన ప్రైవేట్ స్కూల్ బస్‌కు బ్రేక్ ఫెయిల్ అయింది. అందులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది చిన్నారులు ఉలిక్కిపడ్డారు. హాహాకారాలు చేసి ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సును రోడ్డుపక్కనే ఉన్న ఓ తాటిచెట్టుకు పక్కనుంచి ఢీకొట్టించి నిలిపేయడంతో చిన్నారులు ఊపిరిపీల్చుకున్నారు. కవిటి మండలం బాలాజీపుట్టుగ మలుపు వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచిలి నుంచి దూగానపుట్టుగ మీదుగా బి.గొనపపుట్టుగలోని విద్యార్థులను తీసుకువెళ్లేందుకు వస్తున్న స్కూల్ బస్సు సరిగ్గా బాలాజీపుట్టుగ మలుపు వద్దకు వచ్చే సమయానికి బ్రేక్ ఫెయిల్ అయింది. బస్సు యాక్సిలరేటర్ తక్కువ వేగంలోనే ఉన్నా రోడ్డు బాగా ఏటవాలులో ఉండడంతో బస్సు వేగం నియంత్రించలేనంతగా పెరిగింది. బస్సు వేగాన్ని నియంత్రించేందుకు డ్రైవర్ బ్రేక్‌ను తొక్కాడు. కానీ బస్సు వేగం తగ్గలేదు సరికదా బాగా అదిమినా ఆగలేదు. ఇలా ఇరుకైన సింగిల్‌వే రోడ్డులో డ్రైవర్ చాకచక్యంగా అరకిలోమీటరు ప్రయాణించాడు. చివరకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రోడ్డుపక్కనే ఉన్న తాటిచెట్టుకు బస్సును పక్కనుంచి ఢీకొట్టించి ఆపేశాడు. పెద్దగా శబ్ధం రావడంతో సమీపంలో కొబ్బరి తోటల్లో ఉన్న రైతులంతా అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న పిల్లలకు ఏమైందోనని ఆందోళనతో బస్సులోకి వెళ్లారు. అదృష్టవశాత్తూ ఏ పిల్లవాడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే డ్రైవర్‌ను స్థానికులు దేహశుద్ధి చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానికంగా మోటార్‌వాహనాలపై అవగాహన ఉన్న వ్యక్తి బస్సు బ్రేక్‌ఫెయిల్ అయిందా అని డ్రైవర్‌ను ప్రశ్నించాడు. బస్సు కండిషన్ దారుణంగా ఉందని అతడు అంగీకరించాడు. ఐదారు నెలలుగా చెబుతున్నా యాజమాన్యం బస్సును మార్చడంలేదని తెలిపాడు. అంతేకాకుండా టైర్లు దయనీయమైన స్థితిలో ఉండడాన్ని చూసిన స్థానికులు బస్సులో ఉన్న పాఠశాల సిబ్బందిని నిలదీశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఈ విషయంలో శ్రద్ధతీసుకుని కాలంచెల్లిన బస్సులకు అనుమతులు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. అప్పట్లో బాగానే ఉంది దీనిపై ఇచ్ఛాపురం మోటార్వెహికల్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్‌ను ‘సాక్షి’ సంప్రదించింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఏడాది ప్రారంభంలో తనిఖీల సమయంలో బస్సు బాగానే ఉందని మూడు నాలుగు నెలల్లోనే దారుణంగా మార్చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇలాంటి వాహనాలపై తక్షణమే తనిఖీలు నిర్వహించి అనుమతులపై పునఃసమీక్ష చేస్తానని తెలిపారు. -
కాలం చెల్లిన బస్సులే కాలయముళ్లు
సాక్షి,అమరావతిబ్యూరో/విశాఖపట్నం ఆర్టీసీ బస్సులు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. కాలం చెల్లిన బస్సులను నడపుతుండటంతో అవి ప్రజల నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. నష్టాల్లో కూరుకుపోయి, నూతన బస్సులను కొనలేని స్థితిలో ఉన్న ఆర్టీసీ డొక్కు బస్సులకే రంగులద్ది రోడ్లమీదికి వదులుతోంది. దీంతో వాటికి తరచూ బ్రేకులు ఫెయిలవడం.. టైర్లు పగిలిపోవడం వంటివి జరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. విజయవాడలో శుక్రవారం ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిలై అదుపు తప్పి ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఇంత జరుగుతున్నా ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 1993–97 నాటి బస్సులే అధికం.. రాష్ట్రంలో 123 ఆర్టీసీ డిపోలుండగా.. 12,000 ఆర్టీసీ బస్సులున్నాయి. వాటిలో దాదాపు 1600 దాకా కాలం చెల్లిన బస్సులున్నాయి. కృష్ణా రీజియన్ పరిధిలో 14 డిపోలున్నాయి. వీటిలో ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం, ఉయ్యూరు, గవర్నర్‌పేట 1, 2, గన్నవరం పరిధిలో మొత్తం ఆరు డిపోలున్నాయి. వీటిలో మొత్తం 442 సిటీ బస్సులు రోజుకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అందులో 250 బస్సులు కాలం చెల్లినవి కావడంతో ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఈ బస్సుల్లో సీఎన్జీ గ్యాస్‌తో నడిచేవి 299 ఉండగా.. మిగిలినవన్నీ డీజిల్‌తో నడిచేవే. ఈ డీజిల్ బస్సులు అధికంగా 1993–97 సంవత్సరాల నాటివే. అవి ఇప్పటి వరకూ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోమీటర్లు వరకూ తిరిగాయి. 12 లక్షల కిలోమీటర్ల తర్వాత ఒక్క కిలో మీటరు కూడా అదనంగా తిప్పకూడదు. కానీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆ నిబంధన పాటించలేని స్థితిలో ఉంది. కాలం చెల్లిన ఈ బస్సులు ప్రయాణికులకు నిత్యం నరకాన్ని చూపుతున్నాయి. బస్సు వెళ్తున్నప్పుడు, బ్రేకులు వేసినప్పుడు పెద్ద పెద్ద శబ్ధాలు, వానొస్తే నీరు కారడాలు వంటివి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో హెడ్లైట్లు కూడా సక్రమంగా వెలుతురును ఇవ్వడంలేదు. విజయవాడ నగరంలో పెరిగిన జనాభా అవసరాల దృష్ట్యా ఇంకా 400 బస్సులు అవసరమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. మొరాయిస్తూ.. బెంబేలెత్తిస్తూ.. కాలం చెల్లిన బస్సులు నగరవాసుల ప్రాణాలు తీస్తున్నాయి. నగరంలో శుక్రవారం బుడమేరు వంతెన వద్ద సిటీ బస్సు సృష్టించిన బీభత్సంతో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గతంలో బస్సు వెళ్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పుట్ రెస్ట్ జారిపడిపోయింది. మాచవరం ప్రాంతంలో స్టీరింగ్ ఊడిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. గతంలో విద్యాధరపురం ప్రాంతంలో రెండు సార్లు టైర్లు పగిలి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇటీవల బందర్ రోడ్డులోని రేడియో స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు ఓ బస్సు పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన విషయం తెలిసిందే. ఔట్ సోర్సింగ్‌తో అనుభవం లేని మెకానిక్‌లు.. ఆర్టీసీ గ్యారేజ్‌లో మెకానికల్ విభాగంలో ఎక్కువ మంది అనుభవం లేని వారే. సీనియర్ మెకానిక్‌లు రిటైర్డ్ అవుతుండటంతో వారి స్థానంలో ఔట్‌సోర్సింగ్‌లో కొత్త వారిని తీసుకుంటున్నారు. వారంతా యువకులు కావడంతో వారికి బస్సుల మరమ్మతులపై సరైన అవగాహన లేదు. కేవలం డ్రైవర్లు చెప్పిన లోపాలను తాత్కాలికంగా సరిచేసి పంపుతున్నారు. మెకానిక్‌ల కొరత తీవ్రంగా ఉంది. ఒక్క విజయవాడ డిపోలోనే 23 మంది మెకానిక్‌ల కొరత ఉంది. 20 మంది చేయాల్సిన పనిని 10 మందితో చేయిస్తుండటంతో మరమ్మతులు చేసే సమయంలో లోపాలన్నింటినీ సరిచేయలేకపోతున్నారు. విజయవాడలో జరిగిన ఘటనలో తాత్కాలికంగా బ్రేక్‌ను సరిచేసి పంపినందునే బ్రేక్ ఫెయిల్ అయిందని కార్మికులు చెబుతున్నారు. విశాఖ రీజియన్‌లో కాలం చెల్లిన బస్సులు 370, నగరం పరిధిలో 205 ఆర్టీసీ విశాఖ రీజియన్‌లో 1350కి పైగా బస్సులున్నాయి. రీజియన్‌లో 10 నుంచి 17 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను కూడా నడుపుతున్నారు. వీటిలో వందకు పైగా 13 లక్షల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నవి ఉన్నాయి. విశాఖ రీజియన్‌లో సుమారు 370 వరకూ కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నారు. రీజియన్‌కు ఏటా 50 కొత్త బస్సులు అవసరమవుతుండగా యాజమాన్యం అందులో సగం కూడా సమకూర్చడం లేదు. విశాఖ నగరంలో మొత్తం ఏడు డిపోలుండగా.. 670 సిటీ బస్సులున్నాయి. వాటిలో కాలం చెల్లిన బస్సులు 205 ఉన్నాయి. నగర పరిధిలో ఇంకా 35 బస్సులు అవసరం. కమీషన్ల కక్కుర్తే కాటేసింది!? విజయవాడలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన వెనుక కమీషన్ల కక్కుర్తి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సుల మరమ్మతులకు వినియోగించే స్పేర్ పార్ట్స్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అతి తక్కువ కొటేషన్ ఇచ్చిన వారిని ఓకే చేయడం వెనుక కమీషన్ల మర్మం ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాటిలో నాణ్యత కరువవడంతో అవి తక్కువ సమయంలోనే దెబ్బతింటున్నాయి. నాణ్యత లేమే కారణం విజయవాడ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడానికి కారణం నాసిరకం బ్రేక్ లైనింగ్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రతి బస్సు 18 వేల కిలోమీటర్లు తిరిగినçప్పుడు మరమ్మతులు(షెడ్యూల్–3)చేస్తారు. అంటే నాలుగు చక్రాలు తీసి గ్రీజ్ పెట్టి బ్రేక్ లైనింగ్ పరిశీలించి పంపుతారు. ప్రమాదానికి గురైన బస్సుకు ఈ నెల 20న మరమ్మతులు (సాంకేతిక పరిభాషలో షెడ్యూల్–3) చేశారు. అలా మరమ్మతులు చేస్తే మళ్లీ 18 వేల కిలోమీటర్లు తిరిగే వరకూ రిపేర్లు రాకూడదు. ఈ బస్సు గురించి ఈ నెల 26 వ తేదీన డ్రైవర్ లాగ్‌షీట్‌లో బ్రేక్‌లో ఎయిర్దిగి బ్రేక్‌లు పడటంలేదు.. అని ఫిర్యాదు నమోదుచేశాడు. మెకానిక్ పరిశీలించి తాత్కాలికంగా రిపేర్‌చేసి పంపారు. అయినా శుక్రవారం బ్రేక్‌లో ఎయిర్ దిగి వెంటనే పడలేదు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ప్రధానమైన బ్రేక్ లైనింగ్ నాణ్యమైనవి వాడితే లక్ష కిలోమీటర్లు తిరిగే వరకు ఇబ్బంది ఉండదు . కానీ బ్రాండెడ్ పేరుతో వాడే నాసిరకం లైనింగ్‌ల వల్ల కొద్దిరోజులకే పాడవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. విజయవాడ బస్సు ఘటనలో ఇదే జరిగినట్లు నిపుణులు చెపుతున్నారు. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
బాపట్ల: కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గుంటూరు జిల్లాలోని బాపట్ల స్టేషన్ లో రైలును నిలిపివేశారు. తిరుపతి నుంచి ఆదిలాబాద్ కు బయలుదేరిన కృష్ణా ఎక్స్ ప్రెస్ డీ-5 బోగి బ్రేకులు ఫెయిల్ కావడంతో బాపట్ల వద్ద మంటలు అలుముకున్నాయి. దీంతో బోగీలో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన సిబ్బంది వెంటనే రైలు నిలిపివేశారు. హుటాహూటిన బోగీని చేరుకున్న రైల్వే సాంకేతిక శాఖకు చెందిన అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. బ్రేకులను పునరుద్దరణ అనంతరం రైలు బయలుదేరుతుందని స్టేషన్ మాస్టర్ తెలిపారు.