bus rollover
-
నిర్లక్ష్యపు డ్రైవింగే కొంప ముంచింది
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై శనివారం రాత్రి భాకరాపేట ఘాట్‌లో పెళ్లి నిశ్చితార్థం కోసం వస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 300 అడుగులకు పైగా ఉన్న లోయలో బస్సు ఐదు పల్టీలు కొట్టి, పెద్ద పెద్ద బండ రాళ్లను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు తోడు అతి వేగం వల్లే బస్సు నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన డ్రైవర్ రసూల్‌బాషా (47), క్లీనర్ షకీల్ (25), మలిశెట్టి గణేష్ (40), మలిశెట్టి మురళి (45), మలిశెట్టి వెంగప్ప (60), లక్ష్మీకాంతమ్మ (40) ఘటన స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యశస్విని (8) ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ జర్నలిస్ట్ ఆదినారాయణరెడ్డి (45), నాగలక్ష్మి (60) ఆదివారం మృతి చెందారు. మరో 43 మంది క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఎముకలు విరిగిన 22 మందికి బర్డ్ ఆస్పత్రిలో, శస్త్రచికిత్సలు అవసరం అయిన 12 మంది స్విమ్స్‌లో, మరో 9 మందికి రుయాలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రి వద్ద ఆర్తనాదాలు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 45 మందిని (మొత్తం 52 మంది) శనివారం అర్ధరాత్రి తిరుపతిలోని రుయా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాలు విరిగి ఒకరు, ముఖంపై రాడ్లు గుచ్చుకుని రక్తం ధారలు కారుతూ మరొకరు, రెండు చేతులూ విరిగి, కాలు తెగి అల్లాడిపోతూ ఇంకొకరు.. బాధతో చేస్తున్న ఆర్తనాదాలు చూపరుల కంట నీరు తెప్పిస్తున్నాయి. చికిత్స పొందుతూ ఆదివారం వీరిలో ఇద్దరు మృతి చెందారు. పెళ్లికొడుకు వేణు తీవ్ర గాయాలతో తల్లిదండ్రులు, బంధువుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు పడుతున్న ఆరాటం అయ్యో.. అనిపిస్తోంది. డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆదివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి, ధర్మవరం ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ శ్రీహరి, వైద్యాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులతో నేరుగా మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జిల్లా మంత్రులు, అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో అత్యధికులు చేనేత కుటుంబాలకు చెందిన వారని, వారికి అండగా ఉంటామని సీఎం ప్రకటించారని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి తెలిపారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నట్లు చెప్పారు. కాగా, గాయపడిన వారి అభ్యర్థన మేరకు మరింత ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. మృతదేహాలకు తిరుపతి ఎస్వీ మెడికల్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. రుయాలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బస్సు కండిషన్ ఓకే.. అతివేగమే కారణం భాకరాపేట ఘాట్ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంపై లోతైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ బసిరెడ్డి, తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప, ప్రాంతీయ రవాణా శాఖాధికారి సీతారామిరెడ్డి, ఆర్అండ్బీ (జాతీయ రహదారులు) డీఈ సత్యమూర్తి ఆధ్వర్యంలోని బృందం ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. బస్సు కండీషన్ బాగానే ఉందని, డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్ల స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో మలుపు వద్ద లోయలో పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అధికారులు తెలిపారు. ధర్మవరం కన్నీటి సంద్రం అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం ధర్మవరం టౌన్/అర్బన్ : చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద బస్సు బోల్తా ఘటనతో అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణంలోని నేసే పేటకు చెందిన సిల్క్ హౌస్ యజమాని మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్ (పట్టు చీరల వ్యాపారి), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో పాటు మురళి కుమారుడు వేణు (పెళ్లి కొడుకు) గాయపడడంతో ఆ ఇంట తీవ్ర విషాదం అలముకుంది. మలిశెట్టి మురళి బంధువైన మలిశెట్టి వెంగప్ప (పెళ్లిళ్ల పేరయ్య), అతని భార్య నాగలక్ష్మి కూడా చనిపోయారు. మరో బంధువు జింకా చంద్ర కుమార్తె చందన (నాలుగవ తరగతి) మృతి చెందింది. పట్టణంలోని మారుతీనగర్‌లో నివసించే బస్సు డ్రైవర్ నబీరసూల్, శాంతినగర్‌లో ఉండే బస్సు క్లీనర్ షకీల్ (ఇంకా వివాహం కాలేదు) చనిపోయారు. ఇదే ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణరెడ్డి సైతం మృత్యువాత పడ్డారు. ఈయన స్వగ్రామం బుక్కపట్నం మండలం మారాల. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో అతని కుమారుడి నిశ్చితార్థానికి వెళుతూ ప్రమాదంలో చనిపోయాడు. ఆదివారం వీరి మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారి అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని భాకారాపేట వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనపై ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. మృతుల బంధువులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్ బస్సు ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చిత్తూరు జిల్లా అధికార యాంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి తిరుపతి సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను, సహాయక చర్యలను ఆదివారం ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌లు ఈ ఘటనపై వేర్వేరు ప్రకటనల ద్వారా సానుభూతి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, బస్సులకు వేగ పరిమితి విధించాలని పవన్ కల్యాణ్ సూచించారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు
చంద్రగిరి: ఓ పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు (కేఎల్30 ఏ 4995) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరంలోని మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి (కోమలి శిల్క్ హౌస్) మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వేణుతో పాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు 55 మంది శనివారం ఓ ప్రైవేట్ బస్సులో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 10 గంటల సమయంలో మార్గంమధ్యలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో భాకరాపేట ఘాట్‌లో బస్సు ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. కాపాడండి సారూ.. అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. బస్సు పల్టీలు కొట్టడంతో ఆ కుదుపులకు కొందరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో బస్సు మొత్తం రక్తమయమైంది. అయ్యా.. కాపాడండి.. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడిపోగానే అందులో ఉన్న వారు భయంతో కేకలు పెట్టారు. కొందరు కిటికీల్లోంచి బయటకు వచ్చినా, చీకట్లో వారికేమీ కనిపించలేదు. చిన్న పిల్లలు గుక్క పట్టి ఏడుస్తుండగా, మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతికష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. మరికొందరు బస్సులోనే చిక్కుకుపోవడంతో వారిని తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు భాకరాపేట, చంద్రగిరి పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కలెక్టర్ హరినారాయణన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షితరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. 250 నుంచి 300 అడుగుల లోతు నుంచి క్షతగాత్రులను పైకి తీసుకొచ్చేందుకు వందలాది మంది పోలీసులు, రోప్ బృందాలు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఆరుగురు చొప్పున సాయపడాల్సి వచ్చింది. ఒకరిని పైకి తీసుకొచ్చేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. లైట్లు ఒకరు పట్టుకొని, మరొకరు తాడు సాయంతో.. ఇలా ప్రమాదకర స్థితిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, 35 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 20 అంబులెన్స్‌లలో తిరుపతి రుయాకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం అతివేగమే కారణం ప్రమాదకరమైన మలుపులు ఉన్న భాకరాపేట ఘాట్ రోడ్డులో ఈ బస్సు డ్రైవర్ ఎక్కువ వేగంతో నడిపినట్లు సమాచారం. నిత్యం ఈ రహదారిలో వెళ్లే డ్రైవర్లు మాత్రమే వేగంగా వెళ్లడానికి వీలుంటుంది. అలాంటిది ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ అనుభవ రాహిత్యం వల్లే వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి ముందు సమీపంలోని పెట్రోల్ బంకులో బస్సుకు డీజిల్ పట్టించారు. ఆ సమయంలో బస్సును ముందుకు కదిల్చే క్రమంలో ర్యాష్ డ్రైవింగ్‌పై పలువురు డ్రైవర్‌ను హెచ్చరించారు. జాగ్రత్తగా వెళ్లాలని చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే ఘాట్ మొదటి మలుపు వద్దే బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఐదు పల్టీలు కొట్టినట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఈ ఘటనలో వధూ వరుల కుటుంబాల వారు, బంధు మిత్రులు విషాదంలో మునిగిపోయారు. కాగా, 2000లో ఇదే ఘాట్‌లో ఓ పెళ్లి బృందం బస్సు బోల్తా పడి 12 మంది మృతి చెందారు. -
వలస కూలీల బస్సు బోల్తా..
మందస (శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలంలో మంగళవారం వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా పడి 36 మంది గాయపడ్డారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. ► పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు బెంగళూరులో పనిచేస్తున్నారు. ► వీరు పశ్చిమ బెంగాల్‌కే చెందిన స్నేహలత ట్రావెల్స్ బస్సులో సోమవారం స్వస్థలాలకు పయనమయ్యారు. ► శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామ సమీపానికి వచ్చేసరికి డ్రైవర్ ఆశిష్‌కుమార్ నిద్రమత్తులో ఉండడంతో స్టీరింగ్‌పై అదుపు తప్పి బస్సు జాతీయ రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి పల్టీ కొట్టింది. ► బస్సులో మొత్తం 43 మంది ఉండగా, వీరిలో డ్రైవర్, క్లీనర్‌తో పాటు 34 మంది వలస కూలీలు గాయపడ్డారు. ► స్థానికులు ప్రమాదాన్ని గమనించి వెంటనే అక్కడకు చేరుకున్నారు. బస్సు అద్దాలు బద్దలుకొట్టి కూలీలను బయటకు తీశారు. ► మందస పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని అందుబాటులో ఉన్న అన్ని అంబులెన్సులకు సమాచారం అందించారు. ► గాయపడిన వారిని పలాస, హరిపురం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ► మిగిలిన వారిని స్థానిక గిరిజన యూత్ శిక్షణ కేంద్రానికి తరలించి, భోజనం, వసతి ఏర్పాటు చేశారు. -
పశ్చిమ గోదావరిలో పెళ్లి బస్సు బోల్తా
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అరుంధతిపేటకు చెందిన 28 మంది తెలంగాణలోని మణుగూరులో జరిగే వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తు వలనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెస్టారెంట్లోకి దూసుకుపోయిన బస్సు
అనంతగిరి(అరకులోయ): ప్రముఖ పర్యాటక కేంద్రామైన బొర్రాగుహల వద్ద బ్రేకులు ఫెయిలై ఓ బస్సు రెస్టారెంట్లో దూసుకుపోయింది. ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. అరకులోయ స్పోర్ట్స్ పాఠశాలలో జరుగుతున్న వేసవి శిక్షణలో పాల్గొనేందుకు రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులు వచ్చారు. బొర్రాగుహలను తిలకించేందుకు సుమారు వందమంది విద్యార్థులు పాడేరు ఐటీడీఏకి చెందిన రెండు బస్సుల్లో బయలుదేరారు. సోమవారం ఉదయం బొర్రాగుహలను తిలకించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో అందులో ఓ బస్సు బ్రేకులు ఫెయిలై వెనక్కి జారిపోయి ఏపీటీడీసీ రెస్టారెంట్లోకి దూసుకుపోయింది. ఈ సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రెస్టారెంట్లో ఉన్న కుక్, ఇద్దరు గైడ్స్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. రెస్టారెంట్ వద్ద నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. రెస్టారెంట్ లేకపోయి ఉంటే గోస్తానది లోయలోకి బస్సు జారిపోయి పెద్ద ప్రమాదమే జరిగేది. -
బ్రేక్ ఫెయిల్ పెళ్లి బస్సు బోల్తా
ఒడిశా, రాయగడ: రాయగడకు 15 కిలోమీటర్ల దూరంలో పిప్పిలిగుడ గ్రామ పొలిమేరల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివాహానికి వెళ్లి తిరిగివస్తున్న ఓ ప్రైవేటు బస్సు బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. పిప్పిలిగుడ ప్రాంతానికి చెందిన 32 మంది ప్రజలు రామన్నగుడలో వివాహానికి వెళ్లేందుకు ప్రైవేటు బస్సును మంగళవారం బుక్ చేసుకున్నారు. వివాహం చూసుకొని తిరిగి ఇళ్లకు వస్తుండగా పిప్పిలిగుడ గ్రామానికి 200 మీటర్ల ముందు రాత్రి 9 గంటల సమయంలో బస్‌కు బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాయికొమండంగి(40) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో 31 మంది ప్రయాణిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొన్న రాయగడ సమితి బీడీఓ రాజేంద్రమజ్జి, ఏబీడీఓ నరసింహ చరణ పట్నాయక్, తహసీల్దార్ ఉమాశంకర్ బెహరా, పిప్పిలిగుడ పీఈఓ పన్నాకుమార్, ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఒక ప్రైవేటు బస్సులో క్షతగాత్రులను రాయగడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమించడంతో వెంటనే బరంపురం తరలించారు. మరో ముగ్గురిని కొరాపుట్ మెడికల్ కళాశాలకు తరలించారు. కాగా, మృతిచెందిన వ్యక్తిని కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2 వేలు అందించారు. అలాగే మృతి చెందిన వ్యక్తి కుటుంబనికి రూ.20 వేల ఆర్థిక సహాయం, మృతుని భార్యకు పింఛన్ అందిస్తామని అధికారులు తెలిపారు. -
బైక్ అడ్డు వచ్చిందని..!
కంచిలి: మండలంలోని కొత్తంపురం, కర్తలి గ్రామాల మధ్య రోడ్డు పక్కన పొలాల్లోకి ఓ ఆర్టీసి బస్సు ఒరిగిపోయింది. ఘాటీముకుందాపురం నుంచి సోంపేటకు వెళ్లే ఆర్టీసి బస్సు ఈ ప్రమాదానికి గురయింది. ఈ బస్సు ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 8.50 గంటలకు ఘాటీముకుందాపురం గ్రామంలో బయలుదేరింది. సరిగ్గా కర్తలి గ్రామం దాటిన తర్వాత బస్సు డ్రైవర్ కె.వి.రావు కాలిచెప్పులు జారిపోయాయని సరిచేసుకొనేలోగా ఎదురుగా ద్విచక్ర వాహనం అడ్డువచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ తేరుకొని సరిచేసుకొనేలోగా బస్సు అమాంతంగా కుడివైపు రోడ్డు పక్కకు దిగి పొలాల వైపునకు దూసుకెళ్లింది. వెంటనే డ్రైవర్ తేరుకొని బ్రేకు వేయటంతో పొలంలో బస్సు బోల్తాపడకుండా అలా ఒరిగిపోయి ఆగిపోయింది. ఈ సమయంలో బస్సులో సుమారు 200 మంది వరకు విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఉన్నారని కండక్టర్ సోములు తెలిపారు. ఉదయం వేళ కంచిలి, సోంపేట పట్టణాల్లో వివిధ కళాశాలలకు ఈ ప్రాంతాల నుంచి వెళ్లే 120 మంది విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు. అనంతరం పోలీసులు వచ్చి కొంతసేపటి తర్వాత క్రేన్ సహాయంతో రోడ్డు పక్కన దిగబడిపోయిన బస్సును రోడ్డుమీదకు లాగించారు. దీంతో ట్రాఫిక్ యథాతధంగా సాగింది. రోడ్డుకు రెండు వైపులా కనీసస్థాయిలో బెర్మ్‌లు లేకపోవటంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. 2015లో బోల్తా పడిన బస్సు ఇదిలా ఉండగా ఈ మార్గంలోనే మరికొంత దూరంలో కొత్తంపురం గ్రామ చెరువు సమీపంలో 2015 ఆగస్టు 7వ తేదీన బస్సు ప్రమాదానికి గురయింది. ఆ రోజు కళాశాలలు విడిచిపెట్టిన తర్వాత సాయంత్రం పూట సోంపేట నుంచి విద్యార్థులతో వస్తున్న ఆర్టీసి బస్సు ఇక్కడ పొలాల్లోకి దూసుకెళ్లి పూర్తిగా బోల్తాపడిపోయింది. అప్పట్లో కూడా అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్దగా ప్రమాదమేమి జరగలేదు. ఈ మార్గంలో కొత్తంపురం నుంచి కర్తలి గ్రామ కూడలి వరకు గల రోడ్డు ఎత్తులో ఉండి, దిగువున ఇరువైపులా పొలాలు ఉండటంతో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రమాదం సంభవిస్తూనే ఉంది. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో బెర్మ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వాస్తవానికి రోడ్డుకు ఇరువైపులా రోడ్డుకు సంబంధించిన స్థలం ఎంతవరకు ఉందో సర్వేచేసి, తర్వాత అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ దిశగా ఆర్అండ్బీ శాఖ అధికారవర్గాలు ప్రయత్నం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
టైరు పంక్చర్.. గరుడ బస్సు బోల్తా
చివ్వెమ్ల: సూర్యాపేట జిల్లా చివ్వెమ్ల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద గరుడ బస్సు ఓ టైర్ పంక్చర్ అయింది. దీంతో అకస్మాత్తుగా అదుపుతప్పిన బస్సు పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం. గరుడ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.