కొత్తంపురం–కర్తలి గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఒరిగిపోయిన ఆర్టీసి బస్సు
కంచిలి: మండలంలోని కొత్తంపురం, కర్తలి గ్రామాల మధ్య రోడ్డు పక్కన పొలాల్లోకి ఓ ఆర్టీసి బస్సు ఒరిగిపోయింది. ఘాటీముకుందాపురం నుంచి సోంపేటకు వెళ్లే ఆర్టీసి బస్సు ఈ ప్రమాదానికి గురయింది. ఈ బస్సు ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 8.50 గంటలకు ఘాటీముకుందాపురం గ్రామంలో బయలుదేరింది. సరిగ్గా కర్తలి గ్రామం దాటిన తర్వాత బస్సు డ్రైవర్ కె.వి.రావు కాలిచెప్పులు జారిపోయాయని సరిచేసుకొనేలోగా ఎదురుగా ద్విచక్ర వాహనం అడ్డువచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ తేరుకొని సరిచేసుకొనేలోగా బస్సు అమాంతంగా కుడివైపు రోడ్డు పక్కకు దిగి పొలాల వైపునకు దూసుకెళ్లింది. వెంటనే డ్రైవర్ తేరుకొని బ్రేకు వేయటంతో పొలంలో బస్సు బోల్తాపడకుండా అలా ఒరిగిపోయి ఆగిపోయింది.
ఈ సమయంలో బస్సులో సుమారు 200 మంది వరకు విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఉన్నారని కండక్టర్ సోములు తెలిపారు. ఉదయం వేళ కంచిలి, సోంపేట పట్టణాల్లో వివిధ కళాశాలలకు ఈ ప్రాంతాల నుంచి వెళ్లే 120 మంది విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు. అనంతరం పోలీసులు వచ్చి కొంతసేపటి తర్వాత క్రేన్ సహాయంతో రోడ్డు పక్కన దిగబడిపోయిన బస్సును రోడ్డుమీదకు లాగించారు. దీంతో ట్రాఫిక్ యథాతధంగా సాగింది. రోడ్డుకు రెండు వైపులా కనీసస్థాయిలో బెర్మ్‌లు లేకపోవటంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు.
2015లో బోల్తా పడిన బస్సు
ఇదిలా ఉండగా ఈ మార్గంలోనే మరికొంత దూరంలో కొత్తంపురం గ్రామ చెరువు సమీపంలో 2015 ఆగస్టు 7వ తేదీన బస్సు ప్రమాదానికి గురయింది. ఆ రోజు కళాశాలలు విడిచిపెట్టిన తర్వాత సాయంత్రం పూట సోంపేట నుంచి విద్యార్థులతో వస్తున్న ఆర్టీసి బస్సు ఇక్కడ పొలాల్లోకి దూసుకెళ్లి పూర్తిగా బోల్తాపడిపోయింది. అప్పట్లో కూడా అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్దగా ప్రమాదమేమి జరగలేదు. ఈ మార్గంలో కొత్తంపురం నుంచి కర్తలి గ్రామ కూడలి వరకు గల రోడ్డు ఎత్తులో ఉండి, దిగువున ఇరువైపులా పొలాలు ఉండటంతో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రమాదం సంభవిస్తూనే ఉంది. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో బెర్మ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వాస్తవానికి రోడ్డుకు ఇరువైపులా రోడ్డుకు సంబంధించిన స్థలం ఎంతవరకు ఉందో సర్వేచేసి, తర్వాత అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ దిశగా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారవర్గాలు ప్రయత్నం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment