![West Bengal Migrant Family Deceased in Warangal - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/22/wgl.jpg.webp?itok=Gs_GLZVS)
మక్సూద్ నివాసం ఉండే గృహం, బావిలో తేలుతున్న మృతదేహాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్/గీసుకొండ : పొట్టకూటి కోసం ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన కుటుంబం.. ఇరవై ఏళ్లుగా వరంగల్ కరీమాబాద్‌లో నివాసముంటూ చినిగిన బస్తా సంచులు(బార్‌దాన్) కుడుతూ పొట్ట పోసుకుంటున్నారు.. దంపతులతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉండేవారు.. లాక్‌డౌన్ నేపథ్యంలో పనిచేసే చోటకు మకాం మార్చిన ఆ కుటుంబంలోని నలుగురు బావిలో మృతదేహాలుగా తేలారు. కుటుంబ పెద్ద అయిన తండ్రితో పాటు ఆయన భార్య, కుమార్తె, మనవడు విగత జీవులుగా కనిపించడంతో ఎవరైనా హత్య చేశారా.. వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. అందుకు కారణాలేమై ఉంటాయి.. అనే విషయంలో స్పష్టత లభించడం లేదు. గురువారం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని పారిశ్రామిక ప్రాంతం వద్ద వెలుగు చూసిన ఈ ఘటన రాత్రి వరకు మిస్టరీగానే ఉంది.
అన్ని కోణాల్లో పోలీసుల పరిశోధన
గొర్రెకుంట గ్రామంలో నలుగురు వలస కూలీల ఆత్మహత్య ఘటనపై పోలీసులు లోతుగా పరిశోధన చేస్తున్నారు. కూతురు బుష్రా ఖాతూన్(20), మనమడు(3)తో కలిసి ఎం.డీ.మక్సూద్ ఆలం(50), ఎం.డీ.నిషా ఆలం(45) దంపతులు గురువారం బావిలో శవాలై తేలడంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకున్నా వారి మృతి వెనుక ఆర్థిక ఇబ్బందులు కాకుండా మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలాన్ని ఈజ్ట్ జోన్ అదనపు డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్లు జూపల్లి శివరామయ్య, పుల్యాల కిషన్, ఎస్సైలు రహీం, నాగరాజు పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. రాత్రి 8.30 గంటల వరకు సంఘటనా స్థలంలో వివరాల కోసం ఆరా తీసినా రాత్రి 11 గంటల వరకు కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. కాగా నలుగురు బావిలో శవాలై తేలిన కేసు విషయంలోపూర్తి సమాచారం అందాల్సి ఉందని డీసీపీ వెంకటలక్ష్మి రాత్రి విలేకరులకు తెలిపారు.మృతుడు మ క్సూద్ ఆలం కుమారుడు సోయల్ ఆలం,షాబాజ్ ఆ లంతో పాటు మరోఇద్దరు బీహారీ కార్మికుల ఆ చూకీ కోసం పోలీస్ బృందాలతో గాలింపు చేపడుతున్న ట్లు పేర్కొన్నారు.మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని,బీహారీలు ఉంటున్న గదిలో వారికి సంబంధించిన అన్ని వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు.
20 ఏళ్ల క్రితమే పశ్చిమ బెంగాల్ నుంచి
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి 20 ఏళ్ల క్రితం మక్సూద్ బతుకు దెరువు కోసం వరంగల్ వచ్చారు. వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలో కుటుంబంతో అద్దె ఇంటిలో ఉంటూ చిరిగిపోయిన గోనె సంచులు కుడుతూ ఉపాధి పొందే వారు. లాక్‌డౌన్ కారణంగా కరీమాబాద్ నుంచి గొర్రెకుంటకు వచ్చివెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని మక్సూద్ ఆలం దంపతులు కూతురు, మనుమడు, ఇద్దరు కుమారులతో కలిసి గొర్రెకుంటలోని సాయిదత్త ట్రేడర్స్‌కు చెందిన గోదాములోనే ఉంటూ గోనె సంచులు కుడుతున్నారు. అయితే గోదాంలోనే ఇంటి సామాను, బట్టలు తదితర సామాగ్రి వదిలేసి ఉండగా, గురువారం ఉదయం నుంచి మక్సూద్ కుటుంబసభ్యులు కనిపించక పోవడం.. సెల్‌ఫోన్ స్విఛాప్ రావడంతో సాయిదత్త ట్రేడర్స్ యజమానులు భాస్కర్, సంతోష్ గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అన్ని ప్రాంతాలలో వెతకగా, గోదాం సమీపంలోని ఓ బావిలో శవాలై కనిపించడం గమనార్హం.
ఆ నలుగురి కోసం ఆరా... నేడు మృతదేహాలకు పోస్టుమార్టం...
మక్సూద్ ఆలంతో పాటు అతడి భార్య, కూతురు, మనవడు బావిలో శవాలై తేలగా వారి కుటుంబంలో ఇద్దకు కుమారుల ఆచూకీ లేకుండా పోయింది. కుటుంబ సభ్యులతో పాటే ఉంటున్న వారు ఎక్కడికి వెళ్లారనే విషయంలో పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. వీరితో పాటు ఇద్దరు బీహారీ కార్మికులు శ్యాం, శ్రీరాం కూడా కనిపించడం లేదు. ఈ నలుగురి ఆచూకీ తెలిస్తే కానీ బావిలో శవాలై తేలిన వారు ఎలా మృతి చెందారనే విషయం తేలనుంది. కాగా, మృతుల శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఈ కేసు విషయంలో స్పష్టత కనిపించడం లేదు. నలుగురిని ముందే చంపి వారిని బావిలో పడవేసి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తవుతున్నాయి. నాలుగు మృతదేహాలను గురువారం రాత్రే వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం కేసు విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
కార్మికుల కుటుంబానికి సీఎం భరోసా
గొర్రెకుంటలో నలుగురు వలస కూలీల మృతి ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. బతుకుతెరువు కోసం వచ్చి తనువు చాలించడం, అందులో ఓ చిన్నారి ఉండటం తనను కలిచి వేసిందని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లగా మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రిలో పరిశీలించనున్నట్లు తెలిపారు.– ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర మంత్రి
Comments
Please login to add a commentAdd a comment