బావిలో నుంచి శ్రావణి మృతదేహాన్ని బయటికి తీస్తున్న పోలీసులు
సాక్షి,యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జరిగిన శ్రావణి దారుణ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శ్రావణి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 9వ తరగతి పూర్తి చేసిన శ్రావణి, పాఠశాలలో ప్రైవేట్ తరగతులకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న దారుణ ఘటనపై అన్ని వర్గాల్లో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతోంది. శ్రావణిని హత్య చేసింది ఎవరు? అనే అంశంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడేసి పూడ్చిపెట్టడం ఒక్కరి వల్లకాదని, నలుగురు వ్యక్తులు ఇందులో పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిందితులను 24 గంటల్లో పట్టుకుంటామని పోలీసులు శ్రావణి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే హత్య వెనక డ్రగ్స్ బానిసలు ఉన్నారా, లేక వ్యక్తిగత, రాజకీయ కక్షలు.., మరేవైనా కారణాలున్నాయా అన్నది తేలాల్సి ఉంది. కాగా, విధినిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించిన ఎస్‌ఐని ఉన్నతాధికారులు విధుల్లోంచి తప్పించి విచారణకు ఆదేశించారు.
అత్యాచారం చేసి హత్య!
శ్రావణిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని డీసీపీ నారాయణరెడ్డి చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. శ్రావణి ఊపిరాడక చనిపోయిందని తేలింది. దీంతోపాటు ఎడమవైపు పక్కటెముకలు విరిగిపోయాయి. కుడివైపుపక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను చంపిన తర్వాత 25 అడుగుల లోతులోని బావిలోకి పైనుంచి పడేయడంతో పక్కటెముకలు విరిగినట్లు తెలుస్తోంది. శవం ఉబ్బిపోయి, చర్మం ఊడిపోయింది. అయితే అత్యాచారం విషయం లో మరింత స్పష్టత కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. శ్రావణి మృతదేహం దొరికిన బావి వద్ద ఎండిన వరిగడ్డిని గుర్తించారు. బాలిక చనిపోయిన తర్వాత కాల్చివేయాలన్న ఆలోచనలో నిందితులు ఉన్నట్లు భావిస్తున్నారు. అది వీలుకాకపోవడం తో బావిలో పడేసి పూడ్చినట్లు తెలుస్తోంది. శ్రావణి హత్యకేసులో విచారణ చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన స్థలంలో లభించిన ఆనవాళ్లు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ అధారంగా కొందరిని అనుమానిస్తున్నారు.
గ్రామస్తుల రాస్తారోకో..
శ్రావణి హత్య సంఘటనపై ఆమె బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. తాము మిస్సింగ్ కేసు పెట్టినా పోలీసులు సకాలంలో స్పందించలేదని, పోలీసుల వైఫల్యాన్ని నిలదీస్తూ స్థానికులు శుక్రవారం డీసీపీ వాహనంపై దాడి చేసిన విషయం తెలిసిందే. శనివారం కూడా శ్రావణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటకుపైగా రాస్తారోకో జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కోసం వెళ్తూ జాతీయ రహదారిపై మరోసారి రాస్తారోకో చేపట్టారు. దీంతో సుమారు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజల ఆగ్రహంతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకుని బొమ్మలరామారం చేరుకున్న వారు మరోసారి ఆందోళన చేపట్టారు. సీపీ మహేశ్‌భగవత్ సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితులను 24 గంటల్లో పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తానని హామీ ఇవ్వడంతో శ్రావణి అంత్యక్రియలు నిర్వహించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన బొమ్మలరామారం ఎస్‌ఐ వెంకటేశ్వర్లును హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ డీసీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
సీసీ కెమెరాల ఆధారంగా విచారణ
బొమ్మలరామారం నుంచి హాజీపూర్‌కు వెళ్లే అడ్డదారిలో జరిగిన ఈ అమానుషానికి పాల్పడింది ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు సీసీ కెమెరాలను అశ్రయించారు. అయితే పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. కాగా, సమీపంలోని వైన్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ముగ్గురు యువకులు బీర్లు కొనుగోలు చేసిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌కు శివారులో ఉన్న బొమ్మలరామారంలో కొందరు వ్యక్తులు ఇటీవల గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతున్నట్లు పోలీస్‌లకు ఫిర్యాదు వచ్చాయి. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాలు సేవించిన వారు ఈ హత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో విచారణ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment