
చెన్నై, టీ.నగర్: అన్నను హతమార్చిన తమ్ముడు... వదినతో పాటు కేరళలో బుధవారం పట్టుబడ్డాడు. ఆరేళ్ల తరువాత ఈ హత్యకేసు మిస్టరీ వీడింది. కడలూరు హార్బర్ సింగారతోపు గ్రామానికి చెందిన మురుగదాసన్ (45). భార్య సునీత. వీరికి ఇద్దరు పిల్లలు. సౌదీ అరేబియాకు ఉద్యోగం కోసం వెళ్లిన మురుగదాసన్ 2013, జనవరి 6న బావమరిది వివాహం కోసం సింగారతోపునకు వచ్చారు. తరువాత కొన్ని రోజులకు అదృశ్యమయ్యాడు. మురుగదాసన్ అచూకీ తెలియకపోవడంతో, అతని పాస్‌పోర్టు ఇంట్లోనే ఉండడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. అదే సమయంలో చిన్నకుమారుడు సుమయర్ కనిపించకపోవడంతో తల్లి పవనమ్మాళ్‌కు అనుమానం అధికమైంది. కోడలిని సంప్రదించేందుకు వీలుకాలేదు.
దీనిపై పవనమ్మాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో.. మురుగదాసన్ విదేశానికి వెళ్లిన సమయంలో సింగారతోపులోని వదిన సునీతను సుమయర్ తరచూ కలిసేవాడు. దీంతో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి మురుగదాసన్ మందలించడంతో అతన్ని హత్య చేసేందుకు కుట్రపన్నారు. పథకం ప్రకారం అతన్ని హత్య చేసి పాతిపెట్టారు. కేరళలో తలదాచుకున్న ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో పాతి పెట్టిన మురుగదాసన్ మృతదేహాన్ని గురువారం వెలికి తీసి పోస్టుమార్టంకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment