వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ దక్షిణామూర్తి
మల్యాల(చొప్పదండి): కొండగట్టు మెట్లపై 2017 నవంబర్‌లో జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తను గొంతుపై బీరుసీసాతో కోసి చంపిందని జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి తెలిపారు. విలేకరుల సమావేశంలో హత్యకేసు మిస్టరీని వివరించారు. తిమ్మాపూర్ అనుబంధ గ్రామం మక్తపల్లికి చెందిన పాలేటి సంపత్ కొంతకాలం దుబాయ్ వెళ్లి వచ్చాడు. గ్రామంలో ఇల్లు కట్టుకుంటుండగా, ఆయన స్నేహితుడు పెంట సాగర్ తరచూ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో సంపత్ భార్య స్వరూపతో సాగర్‌కు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. విషయం సంపత్‌కు తెలియడంతో స్వరూపను హింసించడం ప్రారంభించాడు.
దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని స్వరూప నిర్ణయించుకుంది. 2017 నవంబర్ 11న సంపత్ కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లాడు. ఈనేపథ్యంలో ప్రియుడు సాగర్‌తోపాటు స్వరూప, ఆమె తమ్ముడు చింత రాము అదే రోజు కారులో కొండగట్టు వెళ్లారు. సంపత్ బీరు తాగుతూ మెట్లదారి వెంట వెళ్తుండగా ముగ్గురు అతడిపై ఒకేసారి దాడికి దిగారు. సంపత్ చేతులను రాము వెనక్కి విరిచిపట్టుకోగా, భార్య తల వెంట్రుకలు పట్టుకుంది. ఈక్రమంలో సంపత్ చేతిలో ఉన్న బీరు బాటిల్‌ను సాగర్ తీసుకొని పగులగొట్టి గొంతులో పొడిచాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆయన సెల్‌ఫోన్‌తోపాటు, పర్సు తీసుకెళ్లారు. కొండగట్టు మెట్లపై హత్య జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటి ఎస్సై నీలం రవి హత్య కేసుగా నమోదు చేశారు. మరునాడు ఇతరుల ద్వారా సమాచారం తెలిసిందనట్లుగా భార్య స్వరూప ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న భర్త మృతదేహాన్ని గుర్తుపట్టింది. భర్తకు అప్పులు ఉన్నాయని, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులకు వివరించింది.
కథ మలుపు తిరిగిందిలా..
కొండగట్టు మెట్లపై సంపత్ హత్యకు గురికావడంతో పాటు ఆయన సెల్‌ఫోన్, పర్సు మాయమయ్యాయి. దీంతో సీఐ కిశోర్ సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు. సంపత్ చనిపోయిన రోజు నుంచి సెల్‌ఫోన్ వినియోగంలో ఉంది. దీంతోపాటు మృతుడి సిమ్, ఫోన్ భార్య వినియోగిస్తుండడంతో మరింత అనుమానానికి బలం చేకూరింది. తన భర్తకు అప్పులున్నాయని చెప్పడం, సంపత్‌కు గ్రామంలో సుమారు కోటి రూపాయల ఆస్తి ఉండడం తదితర అంశాలపై దృష్టి సారించారు. విచారణ చేపట్టగా హత్య మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. సాగర్‌పై హత్య కేసుతో పాటు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు.
నిందితుడి ఆత్మహత్యాయత్నం..
మల్యాల సీఐగా కిశోర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండలంలోని కేసుల పరిష్కారంపై దృష్టిసారించారు. ఈ క్రమంలో 2017లో జరిగిన హత్య కేసు విచారణ ప్రారంభించారు. పెంట సాగర్‌ను 28 ఫిబ్రవరి, 2020న మల్యాల పోలీస్‌స్టేషన్‌కు పిలిపించగా, ఇద్దరుముగ్గురు ప్రజాప్రతినిధులతో స్టేషన్‌కు వచ్చాడు. ఈక్రమంలో స్టేషన్ ఆవరణలోని బాత్రూంలో బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఐ కిశోర్ హుటాహుటిన సాగర్‌ను జగిత్యాలకు అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించి వైద్యం అందించగా నిందితుడు కోలుకున్నాడు.
సీఐ కిశోర్‌కు అభినందన..
రెండున్నరేళ్ల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని ఛేదించిన మల్యాల సీఐ కిశోర్‌ను ఏఎస్పీ దక్షిణామూర్తి అభినందించారు. డిపార్ట్‌మెంట్ పరమైన రివార్డుకు కిశోర్ పేరు సిఫార్సు చేస్తామని అన్నారు. కానిస్టేబుల్ సంపత్‌కు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ, సీఐ కిశోర్, మల్యాల ఎస్సై నాగరాజు, పెగడపల్లి ఎస్సై నవత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment