సాక్షి, ఆసిఫాబాద్: తాగుడుకు బానిసై వేధింపులకు గురిచేస్తున్న భర్తను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు ఇచ్చి కడతేర్చిన సంఘటన రెబ్బెన మండలంలోని లక్ష్మిపూర్‌లో మంగళవారం వెలుగుచూసింది. ఎస్సై దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... రెబ్బెన మండలంలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన చౌదరి శంకర్ (34) 11 సంవత్సరాల క్రితం ఆసిఫాబాద్ పరిధిలోని చిలాటిగూడకు చెందిన రూపతో వివాహమైంది. ప్రస్తుతం వీరికి హరిక, కీర్తణ ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. ఇటీవల భార్యభర్తలకు తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శంకర్ తాగుడుకు బానిసగా మారాడు.
సోమవారం సాయంత్రం శంకర్ కూల్‌డ్రింక్ కావాలని భార్యను కోరాడు. కూల్‌డ్రింక్ తెప్పించిన రూప బాటిల్‌లోని కొంత పిల్లలకు పోసి మిగిలిన దాంట్లో పురుగుల మందు కలిపి శంకర్‌కు ఇచ్చింది. దానిని తాగిన శంకర్ చేదుగా ఉందని భార్యను నిలదీశాడు. అప్పటికే శంకర్ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో స్థానిక ఆర్‌ఎంపీని పిలిపించి పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించేలోగా మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment