నిందితురాలు మహేశ్వరి హత్యకు గురైన ఆనంద్(ఫైల్)
హైదరాబాద్, అత్తాపూర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసి మృతదేహన్ని దహనం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...వికారాబాద్ జిల్లా, కొడంగల్ మండలం, లింగంపల్లికి చెందిన ఆనంద్(32)కు నగరంలోని పురానాపూల్‌కు చెందిన మహేశ్వరితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. బతుకుదెరువు నిమిత్తం ఏడేళ్ల క్రితం నగరానికి వచ్చిన ఆనంద్ కుటుంబంతో సహా శివరాంపల్లిలో ఉంటూ ఓ హోటల్‌లో కుక్‌గా పని చేస్తున్నాడు. మహేశ్వరికి గంధంగూడకు చెందిన ఆటోడ్రైవర్ అంజూతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలో తమకు అడ్డుగా ఉన్న ఆనంద్‌ను హత్య చేయాలని పథకం పన్నారు. ఇందులో భాగంగా మే 2 న మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఆనంద్‌ను మహేశ్వరి, అంజూ గొంతుకు వైర్‌తో బిగించి హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని అంజూ ఆటోలోనే గంధంగూడ మూసీ నది ఒడ్డుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. అయితే మృతుడి సోదరుడు కాశప్ప ఆనంద్‌కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలవకపోవడంతో మే 5న వారి ఇంటికి వచ్చాడు. మహేశ్వరి ఒక్కతే కనిపించడంతో ఆనంద్ విషయం ఆరా తీశాడు. మూడు రోజుల క్రితం పనికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన అతను ఇంతవరకు తిరిగి రాలేదని చెప్పింది. దీంతో కాశప్ప రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిజమైన అనుమానం...
తమ్ముడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసి 10 రోజులైనా ఎలాంటి సమాచారం అందకపోవడంతో కాశప్ప మరోసారి సోదరుడి ఇంటికి వచ్చాడు. ఆ రోజు మహేశ్వరితో పాటు గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో ఉండటాన్ని గుర్తించిన అతను మహేశ్వరిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు తెలిపింది. ఆమె వైఖరిపై అనుమా నం వచ్చిన కాశప్ప మరదలు మహేశ్వరి, తన తమ్ముడితో సన్నిహితంగా నుండే లారీ డ్రైవర్ రాజులపై అనుమానం వ్యక్తం చేస్తూ మరోసారి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మహేశ్వరిని పిలిపించి విచారించగా తనకు తెలియదని చెప్పింది.
ఇదే విషయంపై కాశప్ప వారం రోజులుగా ఆమెను పలు రకాలుగా ప్రశ్నించడంతో విసుగు చెందిన మహేశ్వరి ఆనంద్‌ను తానే చంపానని, ఇందుకోసం మరో నలుగురికి సహాయం తీసుకున్నట్లు తెలిపింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పింది. మంగళవారం అతను ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో మహేశ్వరిని అదుపులోకి తీసుకునిని విచారించారు. గంధంగూడ వద్ద మూసీ నది ఒడ్డున మృతదేహాన్ని తగులబెట్టినట్లు చెప్పడంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలించినా అనవాళ్లు కనిపించలేదు. అయితే మహేశ్వరి, ఆటో డ్రైవర్ అంజూ తమ అదుపులో లేరని, ఆనంద్ హత్య జరిగింది మాత్రం వాస్తవమని అడిషనల్ ఇన్‌స్పె క్టర్ వెంకటేష్ తెలిపారు. తన తమ్ముడి మృతదే హాన్ని తమకు అప్పగించాలని కాశప్ప కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment