హత్యకు గురైన రత్నబాబు
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ఓ మహిళ తన భర్తను కర్కశంగా హతమార్చింది. ఈ ఘటన ఫిరంగిపురం మండలం సిరింగిపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. భర్త నిద్రిస్తున్న సమయంలో మర్మాంగాలపై రోకలితో మోది, గరిటెతో గాయాలు చేసి ఆపై గొంతు నులిమి ప్రాణం తీసింది.
అనైతిక బంధానికి దాంపత్య అనుబంధం ఛిద్రమైంది. అపోహలు, అనుమానాల దావాగ్నికి ఆలుమగల బంధం బుగ్గిగా మారింది. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో కష్టసుఖాల్లో తోడుంటున్న భర్తను కటిక చీకట్లో కనికరం లేకుండా ఓ భార్య కాటికి పంపింది. శనివారం ఫిరంగిపురం మండలం సిరింగిపురంలో జరిగిన ఈ ఉదంతం.. మూడు ముళ్ల బంధానికి ఉరితాడు బిగించింది. అనైతిక బంధాల వ్యామోహం, క్షణికావేశం కలిసి ఆణిముత్యాల్లాంటి ఇద్దరి బిడ్డల జీవితాలను అనాథలుగా మార్చింది. చిన్నారుల భవిష్యత్ ప్రతి ఒక్కరి గుండెలపై ఆందోళన తడి మిగిల్చింది.
పేరేచర్ల(తాడికొండ) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్తను భార్య హతమార్చింది. ఫిరంగిపురం మండలం సిరింగిపురంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరింగిపురానికి చెందిన చుక్కా రత్నబాబు(30)కు అదే గ్రామానికి చెందిన స్వర్ణలతతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి డేవిడ్ అనే ఏడేళ్ల కుమారుడు, షైనీ అనే ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. రత్నబాబు తాపీ వర్కర్. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని స్థానికుల ద్వారా తెలుసుకున్న రత్నబాబు అనేక సార్లు వారించాడు. ఇదే విషయమై స్థానిక పెద్దల వద్ద పంచాయితీ కూడా జరిగింది.
పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటే చాలనే ఉద్దేశంతో తిరిగి భార్యతో కాపురం చేస్తున్నాడు. భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శుక్రవారం రాత్రి ఆమెను మందలించాడు. దీనిని తట్టుకోలేకపోయిన స్వర్ణలత భర్త ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో అతని మర్మాంగాల మీద మోదింది. అంతటితో ఆగక వంటకు ఉపయోగించే పదునైన గరిటెతో గాట్లు పెట్టింది. అయినా చనిపోలేదనే అనుమానంతో గొంతు నులిమి హత మార్చింది. శనివారం ఉదయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రత్నబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
హత్య జరిగిన ప్రదేశాన్ని నర్సరావుపేట రూరల్ డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ ప్రభాకర్‌తోపాటు ఫిరంగిపురం ఎస్‌ఐ ఉజ్వల్ పరిశీలించారు. స్థానికులు, రత్నబాబు, స్వర్ణలత బంధువులను పలు విషయాలపై ఆరా తీశారు. హత్య చేసినట్లు ఒప్పుకొన్న స్వర్ణలతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment