రక్తపు మడుగులో పడివున్న లక్ష్మిదేవి మృతదేహం
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వ్యసనాలకు బానిసైన వారు రక్త సంబంధాలను సైతం లెక్క చేయడం లేదు. తమ అవసరం తీరితే చాలు.. ఇక ఏదీ అవసరం లేదనే స్థాయికి వెళుతున్నారు. ఈక్రమంలో మంచి చెడుల విచక్షణ కూడా కోల్పోతున్నారు. తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకుండానే దారుణాలకు ఒడిగడుతున్నారు. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పింఛన్ సొమ్ము ఇవ్వలేదనే కోపంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు.
గోనెగండ్ల: పింఛన్ సొమ్ము కోసం ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను గొడ్డలితో చంపిన ఉదంతం మండలంలోని ఒంటెడుదిన్నె గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు వివరాల మేరకు.. గ్రామానికి చిన్న నర్సన్న, లక్ష్మిదేవి(60) దంపతులకు వీరేషమ్మ, ఉరుకుందమ్మ, ఈరమ్మ కుమార్తెలు. వీరందరికీ పెళ్లిళ్లు చేశారు. ప్రస్తుతం వారు పెద్దకుమార్తె వీరేషమ్మ వద్ద కోడుమూరు మండలం వర్కూరులో ఉంటున్నారు. సోమవారం పింఛన్ సొమ్ము తీసుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు.
కాగా మద్యానికి బానిసైన నర్సన్న పింఛన్ డబ్బు ఇవ్వాలంటూ రాత్రి భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆవేశానికి లోనై గొడ్డలితో నరికి చంపి ఇంటి తలుపులు వేసి అక్కడి నుంచి ఉడాయించాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి పక్కన ఉండే వారికి తనే ఫోన్ చేసి తన భార్య ఉరివేసుకొని చనిపోయిందంటూ సమాచారం అందించాడు. దీంతో వారు వెళ్లి చూడగా లక్ష్మిదేవి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి మృతురాలి కుమార్తెలకు సమాచారం అందించారు. తల్లి మరణంతో కుమార్తెలు విలపించిన తీరు చూపరులను కంటతటి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుమార్తెల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment