సాక్షి, నేలకొండపల్లి: భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడో భర్త. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని బీడులో మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన మాతంగి గంగాధర్, నవీన అనే భార్యాభర్తలు తమ ఇద్ద మగ పిల్లలతో నివసిస్తున్నారు. ఈ కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నవీనను చున్నీతో ఉరిబిగించి గంగాధర్ చంపాడు. అనంతరం అతను కూడా విష గిళికలు తిని ఆత్మహత్యకు యత్నించాడు. నేలకొండపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.