
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల పేరిట ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో నిరుద్యోగులను మోసగించిన ‘విజ్డం జాబ్స్’ సంస్థను గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ జాబ్ పోర్టల్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ టోకరా ఇచ్చింది. నిరుద్యోగుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు విజ్డం జాబ్స్ పోర్టల్ సీఈవో అజయ్ కొల్లాతోపాటు 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంస్థ రికార్డులను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెడుతున్న ఈ జాబ్ పోర్టల్ వ్యవహారంపై సైబర్ నిపుణులు, దర్యాప్తు అధికారులతో కూడిన 10 ప్రత్యేక బృందాలు విచారణ జరిపాయని, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాబ్ పోర్టల్ విజ్డమ్ జాబ్స్.కామ్.. ఉద్యోగాల ఆశచూపి నిరుద్యోగుల నుంచి వందకోట్ల రూపాయలకుపైగా కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మూడుకోట్లమంది ‘రిజిస్టర్డ్ యూజర్లు’ ఉన్నారని, మన దేశంలో లక్షల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఆయన వెల్లడించారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో తమకు ఒప్పందాలు ఉన్నాయని పేర్కొంటూ.. అనేక దేశాల్లో నిరుద్యోగులను ఈ సంస్థ మోసగించిందని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment