
సాక్షి, బూర్గంపాడు(ఖమ్మం) : భర్త వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సారపాకలోని ముత్యాలమ్మపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మపేటకు చెందిన గండికోట లలిత (32) ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భద్రాచలానికి చెందిన గండికోట రాము.. సారపాకకు చెందిన లలితను పదేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఎనిమిదేళ్ల సంతోష్ అనే కుమారుడున్నాడు. ఐదేళ్ల క్రితం రాము భద్రాచలంలో మరో యువతి దుర్గను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. కొంతకాలంగా రాము మొదటి భార్య లలితను నిర్లక్ష్యం చేసి ఇంటికి రావటం లేదు. ఈ క్రమంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పెద్దమనుషుల సమక్ష్యంలో పంచాయతీ కూడా నడిచింది.
ఆదివారం భార్యాభర్తలు ఇద్దరు చర్లకు వెళ్లి సాయంత్రం తిరిగి సారపాకకు వచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరు గొడవపడి లలితను రాము కొట్టాడు. ఆ తరువాత భర్త భద్రాచలం వెళ్లేందుకు బయలుదేరాడు. దీంతో మనస్తాపానికి గురైన లలిత ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుంది. భద్రాచలం వెళ్లేందుకు బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసిన రాము మళ్లీ ఇంట్లోకి వచ్చాడు. అప్పటికే తలుపులు వేసి ఉండటంతో రాము కిటికిలోంచి చూశాడు. ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి కిందకు దించేసరికి ఆమె కొనఊపిరితో ఉంది. వెంటనే రాము లలిత సోదరులకు ఫోన్ చేశాడు. వారు వచ్చేసరికే లలిత మృతిచెంది ఉంది. మృతురాలి సోదరుడు రమేష్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాంజీనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగం రాలేదని పురుగుల మందు తాగి యువకుడు..
చుంచుపల్లి: మండల పరిధిలోని రామాంజనేయ కాలనీకి చెందిన ఓ యువకుడు ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రామాంజనేయ కాలనీకి చెందిన జంగం కిరణ్‌కుమార్ (29) పీజీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఈనెల 25న ఇంటి వద్ద పురుగుల మందు సేవించగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment