కుటుంబ కలహాలు ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేశాయి. మూడేళ్ల పాపను చంకనెత్తుకొని, ఐదేళ్ల బాలుడి చిటికెన వేలు పట్టుకొని అడుగులేస్తుంటే ... అమ్మ ఎక్కడికో తీసుకువెళ్తోందని సంబరపడ్డారు. కోనసీమలోని గోదారి కాలువ గట్టు వెంబడి వెళ్తుంటే పచ్చని పంటపొలాలు, కొబ్బరి తోటలు, ఆ పక్కనే గలగలపారే జలప్రవాహాన్ని చూస్తూ ఆ చిన్నారుల మదిలో సందడి. వారి కళ్లలో సంతోషాన్ని చూసిన ఆ కన్న తల్లి మనసులో మాత్రం అలజడి. కన్నపేగులను గట్టిగా కావలించుకొని ఆ తల్లి ఒక్కసారిగా దూకేసింది. పరుగులు తీసే ప్రవాహంలోనే ఆ ముగ్గురి ప్రాణాలూ కలిసి పోయాయి.
సాక్షి, ఆత్రేయపురం (తూర్పు గోదావరి): ఆమెకు ఏకష్టమొచ్చిందో ఏమో తెలియదు. ముక్కు పచ్చలారని పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది. భర్తపైన కోపంతో విగతజీవిగా మారిన ఆమె తన తండ్రిని మాత్రం క్షమించమని వేడుకుంది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. అందిన సమాచారం ప్రకారం.. ఆత్రేయపురం మండలం వసంతవాడకు చెందిన మిద్దె బాబూరావు, దుర్గల కుమార్తె నవీనకు బావ వరసయ్యే కారింకి శ్రీనుతో వివాహమైంది. వారికి ఐదేళ్ల రాజేష్, మూడేళ్ల నిత్యనందిని పిల్లలు. వీరు కొంతకాలం వసంతవాడలో కాపురం ఉన్నారు. ఆ తర్వాత మండపేటలో నివాసం ఉంటున్నారు. శ్రీను జూదాలకు, వ్యసనాలకు బానిసవడంతో కుటుంబపోషణ కష్టంగా మారింది.
పిల్లలను కూడా పట్టించుకోవడం లేదంటూ ఆమె చాలా సార్లు భర్తతో గొడవపడింది. కుమార్తె కుటుంబంలో కల్లోలం తలెత్తడంతో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ముందు బాబూరావు మండపేటలోని కొండపల్లివారి వీధిలోకి మకాం మర్చారు. ఏం చేసినా ఫలితం లేదని భావించిన నవీన పిల్లలను వదిలేస్తే వారు అనాథలవుతారని భావించి వారితో కలసి లొల్ల లాకుల సమీపంలో అమలాపురం బ్యాంక్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాలువలోకి దూకే ముందు ఆమె పలకమీద ‘నువ్వు చేసిన తప్పుకు నా బిడ్డలు బాధ పడాలి బావా’ అని ‘నాన్నా నన్ను క్షమించండి’ అని వ్రాసి పలకను గట్టుమీద వదిలివేసింది. ఈ ఆత్మహత్యకు కుటుంబ తగాదాలే కారణం కావచ్చని పలకమీద రాతలను బట్టి తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన సంఘటన స్థలాన్ని సందర్శించారు.
మృతదేహాలను వెలికి తీయాలని పోలీసులను ఆదేశించారు. దీనిపై అమలాపురం డీఎస్పీ ఆర్ రమణ ఆధ్వర్యంలో రావులపాలెం సీఐ వి.కృష్ణ, ఎస్సై నరేష్ కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత బాలిక, అనంతరం బాలుడు, చివరగా నవీన మృతదేహలు సంఘటనా స్థలం సమీపం నుంచే వెలికి తీశారు. మృతదేహాలను కొత్తపేట ప్రభుత్వ అసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేష్ తెలిపారు. రోజూ తమతో ఆడుకునే స్నేహితులు విగతజీవులుగా పడి ఉండటం చూసి అర్థం కాక తోటి స్నేహితులు వారిని ఆడుకోడానికి రమ్మని పిలవడం చూపరులను ఆవేదనకు గురిచేసింది. ఆ తండ్రిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు చేపడితే అసలు విషయాలు వెలుగుచూస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment