సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్‌ను తోటి కానిస్టేబుల్ కిరాతంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో సోమవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న ప్రకాష్, మందాకిని గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రకాశ్‌కు ఇంతకు ముందే వేరే అమ్మాయితే పెళ్లి అయినప్పటికి మందాకినితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.
మొదటి పెళ్లి విషయం తెలుసుకున్న మందాకిని తనను కూడా వివాహం చేసుకోవాలని గట్టిగా నిలదీసింది. దీంతో ఆమెను వదిలించుకోవడానికి ప్రకాష్ కుట్ర పన్నాడు. పథకం ప్రకారం మందాకినిని నమ్మించి గత నెల 29న బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు. అనంతరం మృతదేహాన్ని తన కారులో సదాశివపేట మండలం కొనపూర్ గ్రామ శివారుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మందాకిని తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టాగా ఈ విషయం బయటపడింది. ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకొని మరిన్నివివరాల కోసం విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment