సంఘటన స్థలంలో కీర్తి మృతదేహం.. పక్కన ఆమె భర్త దీపక్
సాక్షి, గాజువాక : విధి ఎప్పుడు ఎవరిపై కర్కశంగా కక్ష వహిస్తుందో అంతుచిక్కదు. ఎప్పుడే తీరున వేటు వేస్తుందో అర్థం కాదు. విధి వికృత లీల కారణంగా అప్పటి వరకూ సంతోషంగా సాగుతున్న కుటుంబాన్ని ఒక్కసారిగా పెను విషాదం కాటేస్తుంది. అనుకోని దుర్ఘటన తుపానులా విరుచుకుపడి సాఫీగా సాగుతున్న కుటుంబ నౌక తలకిందులవుతుంది. అటువంటి విషాదకర సంఘటనే గురువారం సంభవించింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న భర్తకు డయాలసిస్ చేయించేందుకు తోడుగా వెళ్తున్న మహిళను కావేరి ట్రావెల్స్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ ప్రమాదం కారణంగా ఆమె భర్త గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊహించని ఈ ఉపద్రవంతో వారి పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గాజువాకలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది.
ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ బస్సు
ఇందుకు సంబంధించి పోలీసులు అందించిన సమాచారం ప్రకారం... దువ్వాడ వీఎస్‌ఈజెడ్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న దీపక్ వల్లభ మాండవ్య పాతకూర్మన్నపాలెం జంక్షన్‌లోని విజయ టవర్స్‌లో నివాసముంటున్నారు. అతనికి కిడ్నీలో సమస్య తలెత్తడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రోజూ డయాలసిస్ చేయించుకొంటున్నారు. దీని కోసం ఆస్పత్రికి రోజూ కారులో వెళ్తున్న దీపక్ గురువారం మాత్రం తన భార్య కీర్తి మాండవ్య (47)తో కలిసి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. జాతీయ రహదారిపై శ్రీనగర్ జంక్షన్ తరువాత వెనుక నుంచి వచ్చిన కావేరి ట్రావెల్స్ బస్సు దీపక్ నడుపుతున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో కీర్తి మాండవ్య రోడ్డును ఢీకొనడంతో తలకు బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. (చదవండి: ప్రాణాలు కాపాడిన అపరిచిత వ్యక్తి ఫోన్‌కాల్)
దీపక్ ఎడమచేతికి, ముఖానికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీపక్ ప్రస్తుతం నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు గాజువాక సీఐ సూరినాయుడు తెలిపారు. మృతురాలికి ఒక పాప (16), బాబు (11) ఉన్నారు. తల్లిని కోల్పోయి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాను పిల్లల యోగక్షేమాలు ఎలా చూసుకోగలనని దీపక్ విలపిస్తున్న తీరు చూపరులను కలచివేస్తోంది. ఏఎస్‌ఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment