
నిందితురాలు జ్యోతి
శామీర్‌పేట్: భర్తను హత్య చేయడమేగాక ఈ విషయం బయటికి పొక్కకుండా ఇంటి ఆవరణలోనే గోయ్యితీసి పూడ్చి పెట్టిన ఘటన శామీర్‌పేట మండలం కేశవరంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ భాస్కర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేశవరం గ్రామంలో ఈ నెల 3న గుర్తుతెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మామిండ్ల మల్లేష్‌గా గుర్తించారు.
దీంతో మల్లేష్ భార్య జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది వెలుగులోకి వచ్చింది. కేశవరం గ్రామానికి చెందిన మల్లేష్ ,జ్యోతి దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. గత కొంత కాలంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 3న మద్యం మత్తులో ఉన్న మల్లేష్, భార్యతో గొడవపడ్డాడు.
దీంతో జ్యోతి అతడిని తోసివేయడంతో కిందపడిన మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతకూ లేవకపోవడంతో భర్త మృతిచెందాడని గుర్తించి ఆందోళనకు గురైన ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోనే గోయ్యి తీసి పూడ్చిపెట్టింది. వర్షం కురవడంతో మృతదేహం కుళ్లి దుర్వాసన రావడంతో ఆమె ఈ నెల 2న అర్ధరాత్రి శవాన్ని బయటకుతీసి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల గోతిలో పారవేసింది. స్ధానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జ్యోతిని నిందితురాలిగా గుర్తించి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.