
న్యాయవాది హత్య కేసులో నిందితుడు జితేంద్ర అరెస్టు చూపుతున్న పోలీసులు
మదనపల్లె క్రైం : వేర్వేరుగా ఉండడంతోపాటు తప్పుడు కేసులు పెట్టి బంధువుల్లో తలవంపులు తెస్తోందని కట్టుకున్న భార్యను కడతేర్చాలని భర్త పథకం వేశాడు. కిరాయి హంతకులతో హత్య చేయించాడు. గత నెల 30న మదనపల్లె పట్టణం ఎస్‌బీఐ కాలనీలో జరిగిన మహిళా న్యాయవాది నాగజ్యోతి(40) హత్య కేసును మూడు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. సూత్రధారి అయిన భర్త జితేంద్ర(45)ని అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మదనపల్లె పట్టణం ఎస్‌బీఐ కాలనీలో ఉంటున్న ప్రముఖ న్యాయవాది జితేంద్రకు నాగజ్యోతితో 23 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలానికి వీరి మధ్య కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఆ గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో రెండేళ్ల క్రితం విడిపోయి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
కేసు పెట్టి.. పరువు తీసిందని..
ఎనిమిది నెలల క్రితం నాగజ్యోతి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో భర్త జితేంద్రపై తప్పుడు కేసు పెట్టింది. అంతేకాకుండా ఆమె కూడా న్యాయవాది కావడంతో నిత్యం అదే కోర్టులో భర్తకు ఎదురుపడుతూ దూషించేది. బంధువుల్లో తలవంపులు తీసుకువస్తుండడంతో జితేంద్ర తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ఒక కేసులో న్యాయం పొందడానికి తనను ఆశ్రయించిన నిందితుల్లో కొందరిని ప్రలోభ పెట్టాడు. వారితోపాటు మరికొంత మంది సాయంతో భార్యను హత్యచేసేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలోనే ఆమె కదలికలను పసిగట్టిన కిరాయి హంతకులు గత నెల 30వ తేదీన మదనపల్లె పట్టణం ఎస్‌బీఐ కాలనీలో కోమటివానిచెరువు కల్వర్టు వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న నాగజ్యోతిని హత్య చేయించాడు.
సీరియస్‌గా తీసుకున్న డీఎస్పీ
పట్టపగలు మహిళా న్యాయవాది హత్యకు గురికావడాన్ని సీరియస్‌గా తీసుకున్న డీఎస్పీ చిదానందరెడ్డి నాలుగు బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. భర్త తీరుపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు. న్యాయవాది జితేంద్రపై సెక్షన్ 302 రెడ్‌విత్ 34 కింద కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఇంకా కొంతమందిపై కేసు విచారణలో ఉందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. మహిళా న్యాయవాది హత్య కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులకు నగదు అవార్డులు, రివార్డులు ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారని డీఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో సీఐలు సురేష్‌కుమార్, నిరంజన్‌కుమార్, ఎస్‌ఐలు క్రిష్ణయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment