సెల్వం, చంద్రమతి (ఫైల్)
టీ.నగర్: ప్రియుడితో కలసి భర్తను కడతేర్చిన భార్య సోమవారం రాత్రి హత్యకు గురైంది. దీనికి సంబంధించి 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కల్పాక్కం సమీపంలో జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. కాంచీపురం జిల్లా కల్పాక్కం సమీపంలో గల ఆయపాక్కం గ్రామానికి చెందిన సెల్వం (30) లగేజీ ఆటోడ్రైవర్. ఇతని భార్య చంద్రమతి (27). వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత మార్చి 11వ తేదీ కల్పాక్కం సమీపంలో గల పెరుమాళ్‌సేరి గ్రామంలోగల వంతెన కింద సెల్వం మృతదేహం కనిపించింది. దీని గురించి తెలియగానే దిగ్భ్రాంతి చెందిన అతని భార్య తన భర్తను హతమార్చిన నిందితులను అరెస్టు చేయాలని రోదించింది. అంతేకాకుండా నిందితులను అరెస్టు చేయాలంటూ బంధువులతో కలసి ఆందోళన జరిపింది. ఈ సంఘటన గురించి చదురంగపట్టణం పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరిపారు.
ఇందులో సెల్వం ఇంటికి అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు ఆనందన్ (35)తరచు వచ్చి వెళుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆనందన్‌కు, చంద్రమతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సెల్వంకు తెలియడంతో అతను భార్యను మందలించాడు. దీంతో ఆగ్రహించిన చంద్రమతి ఆనందన్‌తో కలిసి సెల్వంను హతమార్చింది. ఇందుకు ఆనందన్ సహచరులు సురేష్ (30), శ్రీధర్ (30), కార్తీక్ (22), ప్రకాష్ (20) సహకరించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు చంద్రమతి, ఆనందన్ సురేష్ శ్రీధర్, ప్రకాష్‌లను పోలీసులు అరెస్టు చేసి జైలులో నిర్భంధించారు. ఇలా ఉండగా చంద్రమతి నెల రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైంది. తరువాత ఆమె తిరుక్కరకుండ్రం సమీపంలో గల ఎలిమిచ్చంపట్టి గ్రామంలో పుట్టింట్లో నివసిస్తూ వచ్చారు. ఇలా ఉండగా చంద్రమతి పిల్లలను చూడాలన్న ఆశతో ఎవరికీ తెలియకుండా ఆయపాక్కం గ్రామానికి వెళ్లింది. చంద్రమతి వచ్చిన విషయం తెలుసుకున్న బంధువులు ఆమెపై మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో ఆమె కేకలు వేస్తూ కిందపడిపోయింది. సమాచారం అందుకున్న చదరంగపట్టణం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రమతిని అంబులెన్స్ ద్వారా చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు జరపగా ఆమె మృతి చెందినట్లు తెలిసింది. దీనికి సంబంధించి 15 మంది వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment