ప్రియుని ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న బాధితురాలు సుమియా, బాబర్, సుమియాతో చర్చిస్తున్న స్థానికులు, పోలీసులు
చిత్తూర్, మదనపల్లె క్రైం : పెళ్లి చేసుకుంటానని మూడేళ్లు సహజీవనం చేశాడు. ఇప్పుడు ఆమెను కాదని మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి వద్దకు చేరుకుని నిరసనకు దిగింది. స్థానికులు స్పందించి ప్రియునికి దేహశుద్ధిచేసి పెళ్లికి ఒప్పించారు. అర్ధరాత్రి సమయంలో మసీదుకు తీసుకెళ్లి మతపెద్దల సమక్షంలో పెళ్లిచేశారు. మదనపల్లె శనివారం రాత్రి తీవ్ర కలకలం రేపింది. టూటౌన్ ఎస్‌ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. చిత్తూరుకు చెందిన సుమియా (25) బెంగళూరులో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె మదనపల్లెలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వచ్చి వెళ్లే సమయంలో చలపతిరావు కాలనీకి చెందిన జిలానీబాషా కుమారుడు బాబర్(30)తో ప్రేమలో పడింది. ఇద్దరూ బెంగళూరులో వేర్వేరు కంపెనీల్లో పనిచేస్తూ మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సుమియా ఐదుసార్లు గర్భం దాల్చింది. బాబర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. ఆ ఆధారాలను సుమియా జాగ్రత్తగా భద్రపరచుకుంది. ఇంతలో బాబర్‌కు పెద్దలు మరో అమ్మాయితో వివాహం నిశ్చయించారు.
ఈ విషయం తెలుసుకున్న సుమియా తాను మోసపోయానని భావించింది. చావోరేవో తేల్చుకోవాలని నిర్ణయించుకుని శనివారం సాయంత్రం మదనపల్లెకు వచ్చింది. ప్రియుడు చలపతిరావు కాలనీలో ఉన్నాడని తెలుసుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అతని ఇంటి వద్దకు చేరుకుంది. సుమియా రాకను గమనించిన బాబర్ అక్కడి నుంచి జారుకున్నాడు. ఆమె ప్రియుని ఇంటి వద్దే భైఠాయించి నిరసనకు దిగింది. స్థానికులు గమనించి ఆమెను విచారించడంతో బాబర్ అసలు రంగు బయటపడింది. దీంతో సహనం కోల్పోయిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే స్థానికులు ఆమెతో బాబర్‌ను పెళ్లికి ఒప్పించారు. ఇద్దరినీ స్థానిక బెంగళూరు బస్టాండులోని పెద్ద మసీదు వద్దకు తీసుకెళ్లారు. మత పెద్దలతో చర్చించి అర్ధరాత్రి పెళ్లి చేయించారు. దీంతో వివాదం సద్దు మణిగింది.
Comments
Please login to add a commentAdd a comment