
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోపై కామెంట్లు చేసిందన్న కోపంతో ఓ మహిళపై వేధింపులకు పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 33 ఏళ్ల మహిళ కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోపై కామెంట్లు చేసింది. ‘‘ సోషల్ డిస్టన్సింగ్ ఏ మిత్ ఇన్ స్లమ్స్’’ అనే వీడియోపై కామెంట్లు చేయటమే కాకుండా ఆ వీడియోను విడుదల చేసిన వ్యక్తిపై కూడా విమర్శలు చేసింది. సమస్యను వివరించటంలో అతడి తీరు బాగోలేదని మండిపడింది. ఈ నేపథ్యంలో అతడి కాలేజ్ స్నేహితులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ వేదికగా ఆమెను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. దీంతో ఆమెవారిని బ్లాక్ చేసింది. ( చైనా: స్కూళ్లకు పిల్లలు.. వాళ్ల తలపై.. )
అయితే ఆ సమస్య అంతటితో వదలలేదు. ఏప్రిల్ 24వ తేదీనుంచి ఆమె ఫోన్‌కు బెదిరింపు కాల్స్ రావటం మొదలుపెట్టాయి. అంతేకాకుండా ఐదుగురు వ్యక్తులు ఆమెకు అభ్యంతరకర మెసేజ్‌లు సైతం పంపారు. అనంతరం తమను క్షమాపణ అడగటమేకాకుండా తాము పంపిన మెసేజ్‌లు డిలేట్ చేయాలని బెదిరించారు. అంతటితో ఆగకుండా ఆమె కంపెనీపై తప్పుడు ప్రచారం చేయటం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన ఆమె ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. తనను వేధించిన వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment