పద్మ భర్త బ్రహ్మయ్యను విచారిస్తున్న సీఐ రాంబాబు
సాక్షి, చినగంజాం(ప్రకాశం) : బంధువులు తనపై దాడి చేశారని మనస్తాపానికి గురైన వివాహిత ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చినగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండలంలోని మోటుపల్లి పంచాయతీ రుద్రమాంబపురం గ్రామానికి చెందిన బసంగారి పద్మ (31) తన ఇంటిలోని ఫ్యానుకు ఉరివేసుకొని మృతి చెందింది. వివరాల్లోకి వెళితే రుద్రమాంబపురం గ్రామంలో బసంగారి కనకయ్య, శ్రీను, భద్రయ్య, ఆంజనేయులు, నాగేశ్వరరావు, బ్రహ్మయ్యలు మొత్తం ఆరుగురు అన్నదమ్ములు కాగా వీరిలో పెద్దవాడు కనకయ్య వేరే గ్రామంలో ఉంటున్నాడు. అయితే శ్రీను, భద్రయ్య, నాగేశ్వరరావు కుటుంబాలకు మిగిలిన ఇరువురు కుటుంబాలకు గత ఐదేళ్లుగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బంధువుల మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలు తోడి కోడళ్ల మధ్య గొడవకు కారణమయ్యాయి. గతంలో మృతురాలి భార్యభర్తలు ద్విచక్రవాహనం మీద వెళుతున్నప్పుడు తమకు తగిలిందని వారిలో ఒక తోడి కోడలు మంగళవారం ఉదయం గొడవ పెట్టుకొని, ఆమెతో పాటు బావలు, మరుదులు, వీరి మద్దతుదారులు మృతురాలు పద్మపై చేతులతో, కాళ్లతో దాడి చేశారు. శరీరంపై దుస్తులు చెదిరిపోయేలా దాడి చేయడంతో ఆమె అవమానానికి గురైంది. ఆ సమయంలో ఆమె భర్త బ్రహ్మయ్య అడ్డుపడి వారిని వారించి పద్మను ఇంటిలోకి పంపి బయట తలుపు వేశాడు. దాంతో వారు బ్రహ్మయ్యపై కూడా చేయి చేసుకున్నారు. అరగంట అనంతరం తోడికోడళ్లు దాడి చేశారని అవమానభారంతో ఇంటిలోకి వెళ్లిన పద్మ లోపల గడియ వేసుకోవడంతో పాటు కిటికీలను సైతం మూసి వేసి ఫ్యానుకు చీర తగిలించి ఉరి వేసుకుంది.
భర్త అనుమానంతో తలుపు తీసేందుకు ప్రయత్నించి రాక పోవడంతో వాటిని పగలగొట్టి లోపలికి వెళ్లి చూడటంతో ఆమె ఫ్యానుకు వేలాడుతూ కన్పించింది. వెంటనే ఆమె వదిన, బావలు ఉరి వేసుకున్న చీరను కూరగాయల కత్తితో కోసి ప్రాణాలతో ఉన్న ఆమెను కిందకు దించారు. స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడు రాజారావును పిలిచి చూపించగా అతను మెరుగైన వైద్యశాలకు తీసుకెళ్లాల్సిందిగా సూచించాడు. ఈ లోగా సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు. గ్రామంలో ఘర్షణ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆమె మృతి చెందడంతో సమాచారాన్ని తమ ఉన్నతాధికారులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇన్‌చార్జ్ ఎస్‌ఐ కే అజయ్ బాబు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ
సంఘటనా స్థలాన్ని చీరాల డీఎస్పీ నాగరాజు, ఇంకొల్లు సీఐ రాంబాబులు సందర్శించి పరిశీలించారు. బాధితుడు బ్రహ్మయ్యను జరిగిన సంఘటనపై విచారించారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా స్పెషల్ పార్టీ పోలీసు బృందం గ్రామంలోకి తెప్పించారు. జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు, ఒక ఎస్‌ఐను కూడా గ్రామంలో ఉంచి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో ప్రస్తుతం 10 మంది మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన వారిని కూడా తీసుకొచ్చి విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment