
శిరీష మృతదేహం
మెదక్ మున్సిపాలిటీ: ‘అడిగినవన్నీ ఇచ్చాం.. అయినా నా బిడ్డను చంపేశారు’ అంటూ రోదించిన ఆ తల్లిదండ్రుల తీరు అందరిని కంటతడి పెట్టించింది. అత్తింటి వేధింపులకు మరో అమాయకురాలు బలైంది. ఈ సంఘటన మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలం జంగపల్లి గ్రామానికి చెందిన అంజమ్మ–వెంకటయ్య దంపతుల కుమార్తె శిరీష(23)కు మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన బక్కొళ్ల రాజు–సుశీల దంపతుల కుమారుడు మహేశ్‌తో గత ఏడాది మే 22న వివాహం జరిగింది.
మహేశ్ చిన్నశంకరంపేట మండలం మందాపూర్ తండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా గతంలో రామాయంపేటలో అద్దెకున్నారు. కాగా ఈ నెల 1 నుంచి మెదక్‌లోని సాయినగర్ కాలనీలో అద్దెకుంటున్నారు.
మహేశ్ రోజుమాదిరిగా మంగళవారం పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి శిరీషా ఎంతకీ తలుపు తీయక పోవడంతో కిటికి అద్దం పగులగొట్టి చూసేసరికి బెడ్‌రూంలో ఉరేసుకుని కనిపించింది.
తలుపు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకున్న శిరీషాను కిందకు దించి, సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ శ్రీరాం విజయ్‌కుమార్, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
నా బిడ్డ ఏంపాపం చేసింది..!
నా బిడ్డ ఏంపాపం చేసింది...అడిగివన్నీ ఇచ్చాం.. అయినా మా బిడ్డను ఉరివేసి చంపేశాడు.. ఊరికే వదిలిపెట్టొద్దంటూ శిరీషా తల్లిదండ్రులు గుండెలు బాధుకున్నారు. ఉద్యోగం ఉందని అడిగినంత రూ.8లక్షల కట్నంతోపాటు 20 తులాల బంగారం, ఇటీవల బుల్లెట్ కొనుకునేందుకు రూ.2లక్షలు, పుస్తెలు కోసమంటే మరో రూ.50వేలు కూడా ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. తమ కూతురును వేధించి వేధించి అత్తింటివారే చంపేశారని వారు ఆరోపించారు.
సారీ వెళ్లిపోతున్నా..
‘అమ్మా...నాన్న..తమ్ముడు సారీ వెళ్లిపోతున్నా.. .అంటూ మృతురాలు శిరీష సూసైడ్‌నోట్ రాసింది. ‘పెళ్లికి ముందు నుంచే వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి తర్వాత నా భర్త మేనమామ నన్ను , మా అమ్మనాన్న, తమ్ముడిని నానా బూతులు తిట్టారు.
ప్రతిసారి వేధింపులకు గురిచేశారు. వారిని మహేశ్ ఒక్కసారి కూడా అడగలేదు. వారి తిట్లకు నాకు బతకాలని లేదు... అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను... అమ్మ... నాన్న, తమ్ముడు.. సారీ’ అంటూ మృతురాలు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment