మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య | Women Constable Murder In Patancheru | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య

Published Thu, May 2 2019 1:13 AM | Last Updated on Thu, May 2 2019 10:20 AM

Women Constable Murder In Patancheru - Sakshi

సదాశివపేట రూరల్‌ (సంగారెడ్డి)/రామచంద్రపురం: రాష్ట్ర రాజధాని శివారులో ఓ మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురైంది. ఆమెతో సన్నిహితంగా మెలిగే మరో కానిస్టేబులే ఈ దారుణానికి ఒడిగట్టాడు. అను మానం, ఆర్థికపరమైన గొడవలతో ఏర్పడిన మనస్పర్థలే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. సదాశివపేట సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలంలోని మేకవనంపల్లి గ్రామానికి చెందిన మందరిక (32) సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమెకు సంగారెడ్డి జిల్లాలోని హత్నూర పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్రకాశ్‌తో పరిచయం ఉంది. అది కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

కొంతకాలం తర్వాత వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. మందరిక వేరే వ్యక్తితో చనువుగా ఉంటోం దని ప్రకాశ్‌ అనుమానం పెంచుకొని తరచూ ఆమె పనిచేసే పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చి గొడవ పెట్టుకోవడంతో అతనిపై అదే స్టేష న్‌లో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో సోమవారం డ్యూటీకి వెళ్లిన మందరిక రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... మొదట ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అలాగే మృతదేహాన్ని తగలబెట్టానని పేర్కొన్నాడు.

మొదట మందరికను తన కారులో ఎక్కించుకొని పటాన్‌చెరు శివార్లలో గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత సదాశివపేట మండల పరిధిలోని వెంకటాపూర్‌ శివారులోని ఓ పంట కాలువలో పెట్రోల్‌ పోసి మృతదేహాన్ని తగలబెట్టాడు. మృతదేహం చాలా భాగం వరకు కాలిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని తగలబెట్టిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సైబరాబాద్‌ మియాపూర్‌ ఏసీపీ రవికుమార్‌ పరిశీలించారు. సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాగా, మందరికతోపాటు పనిచేసిన సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు ఆమె మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement