సాక్షి, రామగుండం : మంత్రాల నెపంతో అత్యాచారయత్నానికి పాల్పడగా.. మహిళ ప్రతి దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. 2 నెలల తర్వాత వెలుగు చూసిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గామండలం మొగల్‌పహాడ్(రాజాపూర్)లో జరిగింది. కుందనపల్లి పంచాయతీ అనుబంధ గ్రామమైన మొగల్‌పహాడ్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి మూడారపు మల్లేశ్ ఇంట్లో 6 నెలల క్రితం చోరీ జరిగింది. దొంగలు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి మల్లేశ్, అతని భార్య సరిత మదన పడుతున్నారు. వీరి పాత ఇంట్లో అద్దెకు ఉన్న దుర్గం ప్రభాకర్ వీరి బాధను సొమ్ము చేసుకునేందుకు పథకం వేశాడు. దొంగతనం చేసిన వారిని గుర్తించే ఒక ముఠా ఉందని, వారిని సంప్రదిస్తే దొంగలు దొరుకుతారని మల్లేశ్ దంపతులకు నమ్మించాడు.
ఇతని మాయమాటలను నమ్మిన వారు ముఠాను తీసుకురావాలని ప్రభాకర్‌ను కోరారు. మంచిర్యాల జిల్లా రెబ్బన మండలం కొమురవెల్లికి చెందిన దుర్గం ప్రకాశ్‌ను జూలైలో తీసుకొచ్చి బాధితులకు పరిచయం చేశాడు. చోరీ జరిగిన ఇళ్లంతా కలియతిరిగిన ప్రకాశ్.. ఇంటికి శాంతి పూజ చేయాలని తెలిపాడు. అందుకు రూ.18 వేలు ఖర్చవుతుందని పేర్కొనగా, చివరకు ఇద్దరి మధ్య రూ.పది వేలకు ఒప్పందం జరిగింది. అప్పటికప్పుడు రూ.3 వేలు మల్లేశ్ చెల్లించాడు. జూలై 26న రాత్రి 10 గంటలకు దుర్గం ప్రభాకర్, దుర్గం ప్రకాశ్ తన శిష్యులైన దుర్గం భీంరావు, తగిడి సోను వచ్చి పూజ ప్రారంభించారు.
పూజలో మల్లేశ్ ఉండగా అర్ధరాత్రి వరకు కొనసాగుతున్న క్రమంలో ‘నీ భార్యలోనే దోషం ఉందని పేర్కొంటూ ఆమెను తీసుకువచ్చి పూజల్లో కూర్చో పెట్టాలి’అని ఆదేశించాడు. దీంతో సరితను తీసుకొచ్చి పూజల్లో కూర్చోబెట్టి మల్లేశ్ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అనంతరం సరితపై ప్రకాశ్ లైంగికదాడికి యత్నించాడు. ఈ హఠాత్పరిణామంతో కోపోద్రిక్తులైన సరిత.. ఈల పీటతో ప్రకాశ్ మెడపై కొట్టడంతో కుప్పకూలాడు. ఈ విషయం సరిత భర్తకు చెప్పింది. అప్పటికే వేకువజామున కావడంతో మృతదేహాన్ని దుప్పటితో చుట్టి ద్విచక్ర వాహనంపై బసంత్‌నగర్ రైల్వే వంతెన మీద నుంచి కింద పడేశారు.
నెల రోజుల తర్వాత రెబ్బన పోలీసులు దుర్గం ప్రకాశ్ మిస్సింగ్ కేసు గురించి తన అనుచరులు భీంరావు, సోనులతో కలసి పలుమార్లు ఇక్కడికి వచ్చి విచారించగా తమకేమీ తెలియదని బుకాయించారు. ఎన్నటికైనా విషయం బయటపడుతుందని భావించి మల్లేశ్ దంపతులు మంగళవారం అంతర్గాం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విచారించి మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment