
లక్ష్మిని బయటకు తీసుకుని వస్తున్న పోలీస్ సిబ్బంది
సాక్షి, మార్కాపురం (ప్రకాశం): నగదు లావాదేవీల విషయంలో మహిళ బెదిరింపునకు దిగడంతో పట్టణంలోని విజయలక్ష్మి వీధిలో ఉత్కంఠ రేగింది. నగదు విషయం తేలే వరకు బయటకు వచ్చేది లేదని ఇంట్లో వారిని బయటకు పంపేది లేదని హంగామా చేయడంతో స్థానికుల సమాచారంతో సమస్య పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆమె ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందోననే భయంతో పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌ను ఆ నివాసం బయట సిద్ధంగా ఉంచారు. వివరాలు.. వినుకొండ పట్టణానికి చెందిన చీదెళ్ల లక్ష్మి భర్త శ్రీరామమూర్తి మార్కాపురం పట్టణానికి చెందిన గ్రంథె వెంకటరత్నం వద్ద సుమారు 20 ఏళ్ల క్రితం మూడు లక్షల రూపాయలను వడ్డీకి తీసుకున్నాడు. ఒక ఏడాది వడ్డీ చెల్లించిన శ్రీరామమూర్తి మరుసటి ఏడాది నుంచి వడ్డీతో పాటు అసలు కూడా ఇవ్వక పోవడంతో పలు మార్లు మధ్యవర్తి సహకారంతో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.
అయినా నగదు చెల్లించకపోవడంతో వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులోని శ్రీరామమూర్తికి చెందిన భూమిని వెంకటరత్నంకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇలా జరుగుతుండగా సదరు భూమికి ఇటీవల మంచి ధర రావడంతో వినుకొండలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సెప్టెంబర్ 30న వెంకటరత్నం వెళ్లి మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఈ విక్రయంలో వెంకటరత్నంకు సుమారు 25లక్షల రూపాయలు రావడంతో చీదెళ్ల లక్ష్మి దంపతులు అక్కడకు చేరుకుని అడ్డం తిరిగారు. తాము అప్పుగా పొందిన నగదుకు, వడ్డీతో సహా చెల్లింపు చేసుకుని మిగిలిన డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి వెంకటరత్నం ససేమిరా అనడంతో మంగళవారం వినుకొండ నుంచి వచ్చిన చీదెళ్ల లక్ష్మి మార్కాపురంలోని వెంకటరత్నం నివాసంలోకి వెళ్లి తాను తెచ్చుకున్న రెండు తాళాల్లో ఒకదానిని బయట గేటుకు వేసింది.
వెంకటరత్నం భార్యను లోపల పెట్టి మరో తాళం వేసింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులతో తనకు న్యాయం జరిగే వరకు తాళాలు తీసేది లేదని చెప్పడంతో పాటు తాళాలు పగలగొడితే గ్యాస్ సిలిండర్ వెలిగించి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మధ్యాహ్నానికి భర్త శ్రీరామమూర్తి మార్కాపురం రావడంతో తాళం తీసిన.. లక్ష్మితో పాటు ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి సమస్య పరిశీలించారు. ఇదే విషయంలో లక్ష్మి గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. సంఘటనపై సీఐ కేవీ రాఘవేంద్రను వివరణ కోరగా చీదెళ్ల లక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment